జైలుకెళ్లేందుకు సిద్ధమే! | evks elangovan Fire on aiadmk government | Sakshi
Sakshi News home page

జైలుకెళ్లేందుకు సిద్ధమే!

Jan 8 2016 2:11 AM | Updated on Sep 3 2017 3:16 PM

జైలుకెళ్లేందుకు సిద్ధమే!

జైలుకెళ్లేందుకు సిద్ధమే!

అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి సామ్రాజ్యమనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఈ విషయంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని

అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిమయం
25 శాఖల్లో అవినీతిపై పుస్తకం విడుదల

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి సామ్రాజ్యమనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఈ విషయంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ సవాల్ విసిరారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో 25 శాఖలు అవినీతిమయమని పేర్కొంటూ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. చెన్నై రాయపేటలోని సత్యమూర్తి భవన్‌లో గురువారం జరిగిన పార్టీ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి వివరాలతో గత ఏడాది మేలో రాష్ట్ర గవర్నర్ కే రోశయ్యకు ఒక వినతిపత్రం సమర్పించానని తెలిపారు.
 
 అయితే ఫిర్యాదు చేసి ఏడునెలలు దాటినా ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. దీంతో మరో పట్టికను తయారుచేసి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అవినీతి వివరాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళుతున్నామని చెప్పారు. పుస్తకాన్ని బాగా చదివితే అవినీతి ఆరోపణలపై ఆధారాలు లభిస్తాయని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ అవినీతి చర్యలను వెల్లడి చేయడం ఎంతమాత్రం తప్పుకాదని ఆయన అన్నారు.  గవర్నర్ ఏదైనా చర్యలు తీసుకుంటారని ఆశించి భంగపడ్డామని వ్యాఖ్యానించారు.
 
 వ్యవసాయాధికారి ముత్తుకుమారస్వామి ఆత్మహత్య కేసులో ఆశాఖ మంత్రిని మాత్రమే తొలగించారు, సీబీఐ విచారణకు ఆదేశించలేదేమని ప్రశ్నించారు. అవినీతి వ్యవహారాలపై ప్రజాకోర్టులోనే చర్చించి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమెనామని తెలిపారు. న్యాయస్థానాల కంటే ప్రజాస్థానాలనే తాను ఎక్కువగా నమ్ముతానని అన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం పరువునష్టం దావాలు, బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. మీడియా గొంతును సైతం నొక్కుతోందని అన్నారు. అయితే తాను ఎంతమాత్రం బెదిరేది లేదు అవసరమైతే కోర్టు, జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమని ఇళంగోవన్ సవాల్ చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన అవినీతి పుస్తకంలో సీఎం జయ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖలతో కలుపుకుని మొత్తం 25 శాఖల పేర్లను ప్రస్తావించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement