డీఎన్‌ఏ సేకరణ | Coast Guard aircraft DMA Collecting | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏ సేకరణ

Jul 18 2015 2:11 AM | Updated on Sep 3 2017 5:41 AM

గత నెల 8వ తేదీన కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానంలో ప్రయాణించిన ముగ్గురు అధికారుల కుటుంబసభ్యుల నుంచి గురువారం రాత్రి డీఎన్‌ఏ సేకరించారు.

 చెన్నై, సాక్షి ప్రతినిధి:గత నెల 8వ తేదీన కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానంలో ప్రయాణించిన ముగ్గురు అధికారుల కుటుంబసభ్యుల నుంచి గురువారం రాత్రి డీఎన్‌ఏ సేకరించారు. కోస్టగార్డ్ విమానం గాలింపు ఇటీవలే పూర్తికాగా, విమాన శకలాలతోపాటు అందులో ప్రయాణించిన వారివిగా భావిస్తున్న ఎముకలు, ఒక చేతి గడియారం లభ్యమైనాయి. అయితే ఆ ఎముకలు అధికారులవే అని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని ఇండియన్ కోస్ట్‌గార్డ్ (తూర్పు) ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న పెలైట్ విద్యాసాగర్ తండ్రి సన్యాసీరావ్, సహాయ పెలైట్ సుభాష్ సురేష్ తండ్రి సురేష్, తల్లి పద్మ, భార్య దీపలక్ష్మి, అసిస్టెంట్ కమాండర్ ఎంకే సోని తండ్రి ఆర్‌ఎస్ సోని గురువారం రాత్రి చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని డీఎన్‌ఏ పరీక్షల కోసం రక్తం నమూనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ సోని మీడియాతో మాట్లాడుతూ గాలింపు చర్యల్లో లభ్యమైన చేతి గడియారం తన కుమారునిదేనని, అతను చనిపోయినట్లు నిర్ధారించుకున్నానని ఆవేదనతో అన్నారు. అయితే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం డీఎన్‌ఏ పరీక్షలు చేయాలి కాబట్టి ఇక్కడకు వచ్చానని అన్నారు. గాలింపు చర్యల్లో ఎటువంటి లోటు లేదని, సంతృప్తికరంగా సాగాయని అన్నారు. ఏదేమైనా విమానం కూలడం దురదృష్టకర సంఘటన అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement