ఆప్యాయతకు నిలయం గొల్లపూడి కుటుంబం

ఆప్యాయతకు నిలయం గొల్లపూడి కుటుంబం


తమిళసినిమా: ఆప్యాయత, అనుబంధాలకు నిలయం గొల్లపూడి కుటుంబం అని ప్రఖ్యాత నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మూడో కుమారుడు శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన పేరుతో జాతీయ అవార్డును నెలకొల్పారు. 17 ఏళ్లుగా దేశానికి చెందిన ప్రతిభావంతులైన తొలి చిత్ర దర్శకుడిని ఎంపిక చేసి నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందిస్తూ వస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జ్యూరీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2014 ఏడాదికి హిందీ చిత్రం క్యూ దర్శకుడు సంజీవ్ గుప్తాను అవార్డుకు ఎం పిక చేశారు.

 

  18వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ప్రఖ్యాత నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమానికి స్థానిక రాయపేటలోని గల మ్యూజిక్ అకాడమీ వేదికైంది. చిరంజీవి చేతుల మీదుగా క్యూ చిత్ర దర్శకుడు సంజీవ్ గుప్తాను ఘనంగా సత్కరించి లక్షన్నర నగదు బహుమతిని అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ కార్యక్రమం చూస్తుంటే కొంచెం బాధగా, కొంచెం సంతోషంగా ఉందన్నారు. గొల్లపూడి మారుతీరావుతో తనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు.

 

 ఆయన మంచి నటుడే కాకుండా గొప్ప రచయిత అని కొనియాడారు.  తను, నటి సుహాసిని నటించిన కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా శ్రీనివాస్ పని చేశారని గుర్తు చేశారు. తన కొడుకు పేరుతో మారుతీరావు అవార్డును నెలకొల్పి నూతన  దర్శకులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. నటి సుహాసిని, దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్, బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరేఖాన్, అనుష్క, లిజి నిర్మాతలు కందేపి సత్యనారాయణ, ఘంట సాల రత్నకుమార్ పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top