breaking news
Gollapudi Srinivas
-
ఆప్యాయతకు నిలయం గొల్లపూడి కుటుంబం
తమిళసినిమా: ఆప్యాయత, అనుబంధాలకు నిలయం గొల్లపూడి కుటుంబం అని ప్రఖ్యాత నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మూడో కుమారుడు శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన పేరుతో జాతీయ అవార్డును నెలకొల్పారు. 17 ఏళ్లుగా దేశానికి చెందిన ప్రతిభావంతులైన తొలి చిత్ర దర్శకుడిని ఎంపిక చేసి నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందిస్తూ వస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జ్యూరీ చైర్మన్గా వ్యవహరించారు. 2014 ఏడాదికి హిందీ చిత్రం క్యూ దర్శకుడు సంజీవ్ గుప్తాను అవార్డుకు ఎం పిక చేశారు. 18వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ప్రఖ్యాత నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమానికి స్థానిక రాయపేటలోని గల మ్యూజిక్ అకాడమీ వేదికైంది. చిరంజీవి చేతుల మీదుగా క్యూ చిత్ర దర్శకుడు సంజీవ్ గుప్తాను ఘనంగా సత్కరించి లక్షన్నర నగదు బహుమతిని అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ కార్యక్రమం చూస్తుంటే కొంచెం బాధగా, కొంచెం సంతోషంగా ఉందన్నారు. గొల్లపూడి మారుతీరావుతో తనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఆయన మంచి నటుడే కాకుండా గొప్ప రచయిత అని కొనియాడారు. తను, నటి సుహాసిని నటించిన కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా శ్రీనివాస్ పని చేశారని గుర్తు చేశారు. తన కొడుకు పేరుతో మారుతీరావు అవార్డును నెలకొల్పి నూతన దర్శకులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. నటి సుహాసిని, దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్, బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరేఖాన్, అనుష్క, లిజి నిర్మాతలు కందేపి సత్యనారాయణ, ఘంట సాల రత్నకుమార్ పాల్గొన్నారు. -
ప్రతి ఫ్యామిలీని టచ్ చేస్తుంది: చిరంజీవి
చెన్నై : ప్రేమాభిమానాల కలయికతో రూపొందిన పురస్కారం 'గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు' అని ప్రముఖ నటుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. అందుకే ఈ పురస్కారం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారని ఆయన వివరించారు. చెన్నైలో బుధవారం జరిగిన గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రదానోత్సవంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సినిమా అవార్డుల పురస్కార ప్రదానాలను... నిర్వహకులు స్కూల్లో జరిగే అవార్డుల ఫంక్షన్లుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారం ప్రదానోత్సవం అలా కాదని... ఈ కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసే విధంగా ఉంటుందన్నారు. 2014 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని హిందీ నాటకం 'క్యూ' రూపొందించిన సంజీవ్ గుప్తాకు ఈ అవార్డుతోపాటు రూ. 1,50, 000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ హాజరయ్యారు. అలాగే ప్రముఖ హీరో సిద్ధార్ధ్, తమిళ నిర్మాత కార్తీక్ సుబ్బరాజులు విచ్చేశారు. దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి మరణించిన విషయం తెలిసిందే. దాంతో గొల్లపూడి శ్రీనివాస్ పేరిట ఆయన తండ్రి ప్రముఖ నటుడు, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు 1998లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.