ఛట్ పూజకు భారీ ఏర్పాట్లు | Chhath Puja BJP writes LG to ensure proper arrangements | Sakshi
Sakshi News home page

ఛట్ పూజకు భారీ ఏర్పాట్లు

Nov 6 2013 1:07 AM | Updated on Mar 29 2019 9:18 PM

పూర్వాంచలీయులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛట్ పూజ కోసం ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చే స్తోంది. ఛట్ పూజను పురస్కరించుకుని ఈ నెల

సాక్షి, న్యూఢిల్లీ:పూర్వాంచలీయులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛట్ పూజ కోసం ప్రభుత్వం  భారీఎత్తున ఏర్పాట్లు చే స్తోంది. ఛట్ పూజను పురస్కరించుకుని ఈ నెల  8, 9 తేదీల్లో పూర్వాంచలీయులు యమునా నదితీరంలోని ఘాట్లతోపాటు  నగరంలో కాలువులు, సహజ జలాశయాలతో పాటు కృత్రిమంగా ఏర్పాటుచేసే జలాశయాల వద్ద సూర్యభగవానునికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆర్ఘ్యప్రసాదాలను సమర్పిస్తారు. ఇందుకోసం యమునా నది ఘాట్లను శుభ్రం చేసి టెంట్లు వేయడం, వెదురు బారికేడ్లు నిర్మించడం తదితర పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఐటీఓ ఘాట్, యమునా ఘాట్, కుదేశియా ఘాట్ల  వద్ద గుట్టల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్ సంచులు, సీసాలను తొలగిస్తున్నారు. రాత్రి పూట నదీ తీరంలో బస చేయదలచిన వారికోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.
 
 యమునా నది లోతుల్లోకి ప్రజలు వెళ్లకుండా ఉండడం కోసం కంచెలు, ప్రజలను నియంత్రించడం కోసం వెదురు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టం తదితరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 72 ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం సమయంలో జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అటువంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత ్తలు తీసుకుంటున్నారు. యమునా నది తీరాన మయూర్ విహార్, షకర్‌పుర్, గీతాకాలనీ, సోనియా విహార్, బదర్ పూర్‌లలోగల అనేక ఘాట్ల వద్దకూడా పూర్వాంచలీయులు సూర్యునికి ఆర్ఘ్యపాద్యాలను సమర్పిస్తారు, కోండ్లీ కాలువకు ఇరువైపులా ఛట్‌పూజ కోసం పది ఘాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇవేకాకుండా అనేక ఉద్యానవనాల్లో కృత్రిమ జలాశయాలను నిర్మించే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
 
 పూర్వాంచలీయులను ఆకట్టుకునేందుకు తంటాలు
 శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు కూడా పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఈ సందర్భాన్ని  శాయశక్తులా వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పూర్వాంచలీయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఛట్  ఫూజ రోజును ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తామనిప్రకటించిన బీజేపీ.. ఈ పూజ కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇప్పటికే ఓ లేఖ రాసింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు  చేయకపోయినట్టయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఛట్ పూజ ఘాట్ల వద్ద తమ పార్టీ కార్యకర్తలు సేవలందిస్తారని ఆ పార్టీ   నాయకుడొకరు చెప్పారు. కాగా తమ పార్టీ నేతలు,కార్యకర్తలు ఛట్ పూజలో పాల్గొంటారని ఆమ్ ఆద్మీపార్టీ కూడా ఇప్పటికే ప్రకటించింది.
 
 అన్ని నియోజకవర్గాల్లోనూ...
 నగర ఓటర్లలో 40 శాతం మంది పూర్వాంచలీయులే. దాదాపు అన్ని నియోజకవర్గాలలో పూర్వాంచలీయులు ఉన్నారని, కనీసం 30 నియోజక వర్గాల్లో ఫలితాలను వారు  ప్రభావితం చేయగలరని రాజకీయ విశ్లేషకులు అం టున్నారు. పూర్వాంచలీ ఓటర్లకున్న ఈ  సంఖ్యాబలం కారణంగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వారిని ఆకట్టుకునే  ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement