శభాష్ చంద్రశేఖర్ | Sakshi
Sakshi News home page

శభాష్ చంద్రశేఖర్

Published Sat, Mar 14 2015 1:07 PM

శభాష్ చంద్రశేఖర్ - Sakshi

ఆయనొక మానసిక వికలాంగుడు....ఆయన కనబడితే చాలు ఏదో చేసేస్తాడన్న భయంతో అందరూ పరుగులు పెట్టేవారు...కానీ ఆయన మాత్రం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడు....మానసిక రోగే అయినా తన వంతు ఎదో ఒక మంచి పనిచేయడం ఆయన సొంతం... పారిశుధ్యం లోపించేలా చెత్తకుప్పలు కనబడితే వాటిని చెత్తకుండీల్లో పడేయడం.... ప్రజలకు ఇబ్బంది కలిగించేలా కనిపించే మురుగు నీటిని తొలగించడం అతని దినచర్య.... చెత్తకుప్పలు కనిపిస్తే చాలు....పారిశుధ్య కార్మికులు శుభ్రం చేస్తారో లేదో కానీ ఆయనకు చెత్తకుప్పలు కనబడితే చాలు వాటిని తొలగించి శభాష్ అనిపించుకుంటున్నాడు  చంద్రశేఖర్ మొదలియార్.
 
 తిరువళ్లూరు: తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధికి చెందిన చంద్రశేఖర్ (50). ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల నుంచి మానసిక రోగిగా మారిన చంద్రశేఖర్ అక్కడక్కడా తిరుగుతూ దొరికింది తిని జీవనం కొనసాగిస్తున్నాడు. అప్పడప్పుడు  అరిచే చంద్రశేఖర్‌ను కొత్తగా చూసే వారికి మాత్రం భయమేస్తుంది. కానీ చంద్రశేఖర్‌ను తరచూ చూసే వారు ఆయన చేసే పనులకు మెచ్చి స్వచ్ఛభారత్‌కు అసలైన అంబాసిడర్‌గానే పిలుస్తుంటారు.
 
 రోడ్డుపై అక్కడక్కడ పడేసే చెత్తకుప్పలను కుండీల్లో వేయడం. రోడ్డులో కనిపించే పశువులను పక్కకు తోలడం, రోడ్డులో ఏర్పడే చిన్నచిన్న గుంతలను మట్టితో పూడ్చడం, అక్కడక్కడ పడేసే ప్లాస్టిక్ వస్తువులను మట్టిలో పూడ్చిపెట్టడం. చె ట్లకు నీళ్లుపోయడం లాంటి పనులను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మానసిక రోగే అయినా చంద్రశేఖర్ చేస్తున్న పనులు పలువురికి ఆదర్శంగా నిలవడంతో పాటు పలువురిని ఆలోచింపచేసేలా ఉన్నాయి.
 
 మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలి, చెత్తకుప్పలను కుండీల్లోనే వేయాలి అంటూ గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చి స్వచ్ఛభారత్ పేరిట హంగామా చేస్తూ మీడియాకు కనిపించి మెల్లగా జారుకునే వారున్న నేటి కాలంలో మానసిక రోగి చేస్తున్న పలు పనులు పలువురికి ఆదర్శంగానే నిలుస్తున్నాయి.

Advertisement
Advertisement