'సీఎం ఆఫీస్' ఫైళ్ల అప్పగింతపై సందిగ్ధత | Sakshi
Sakshi News home page

'సీఎం ఆఫీస్' ఫైళ్ల అప్పగింతపై సందిగ్ధత

Published Mon, Jan 25 2016 3:48 PM

'సీఎం ఆఫీస్' ఫైళ్ల అప్పగింతపై సందిగ్ధత - Sakshi

- దస్త్రాలు తిరిగిచ్చేలా సీబీఐని ఆదేశించాలని వాదించిన ఢిల్లీ సర్కార్
- లోతైన విచారణ అవసరమన్న హైకోర్టు

న్యూఢిల్లీ:
సంచలనం సృష్టించిన 'ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు' కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రటరీ) రాజేంద్ర కుమార్ కార్యాలయం నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొంది.

'సీఎం ఆఫీస్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్లను సీబీఐ తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలా లేక విచారణ ముగిసేవరకు తనవద్దే ఉంచుకోవాలా? అనే ప్రశ్నకు జవాబు వెతకాల్సిఉంది' అని సోమవారం హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చేందుకు వీలుగా స్వాధీనం చేసుకున్న ఫైళ్ల కాపీలను తనకు అందించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదావేసింది.

 

ఎలాంటి ముందస్తు  అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించడం దేశవ్యాప్తంగా రాజకీయప్రకంపనలు సృస్టించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫైళ్లలో కీలక సమాచారం ఉందని, వెంటనే వాటిని తమకు అప్పగించాలని ఢిల్లీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించిన దరిమిలా విచారణ కొనసాగుతున్నది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement