సీబీఐ విచారణకు ఆదేశించండి

CBI Probe On Jagannath Temple Issue Orissa - Sakshi

భువనేశ్వర్‌/కటక్‌ : ప్రతిష్టాత్మకమైన పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో స్వామి కొలువుదీరిన శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి అదృశ్యంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో బుధవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. ఈ వ్యవహారంపై జగన్నాథుని భక్తుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ సంఘటనపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ రఘువీర్‌ దాస్‌ అధ్యక్షతన న్యాయ కమిషను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ అనుమతితో నిపుణుల బృందం..

భారతీయ పురావస్తు శాఖ రత్న భాండాగారాన్ని ఇటీవల సందర్శించింది. రత్న భాండాగారం అంతా బాగానే ఉందని, ఎటువంటి ఢోకా లేనట్లు శ్రీజగన్నాథ మందిరం పాలక వర్గం(ఎస్‌జేటీఏ) ప్రకటించింది. ఇంతలో భాండాగారం తాళం చెవి కనిపించడం లేదనే వార్త బయటకు పొక్కింది. దీంతో నిపుణుల బృందం రత్న భాండాగారాన్ని పరిశీలించడం బూటకమని తేలిన నేపథ్యంలో.. దిలీప్‌ కుమార్‌ మహాపాత్రో అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా చొరవ కల్పించుకుని ఈ సందిగ్ధత తొలగించాలని అభ్యర్థించారు. 

జగన్నాథుని ఆస్తులు అపారం
ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథునికి అమూల్యమైన స్థిరచరాస్తులు ఉన్నాయి. దాదాపు 60,410 ఎకరాల స్థలాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. స్వామి ఆస్తులు పలుచోట్ల అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. వీటికి విముక్తి కలిగించలేని దయనీయ స్థితిలో పాలక వర్గం కొట్టుమిట్టాడుతోంది. స్థిరాస్తుల్లో గనులు కూడ ఉన్నాయి. వీటిలో అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం సముదాయంలో ఏర్పాటు చేసిన రత్న భాండాగారంలో అమూల్యమైన సంపద ఉంది. రత్నాలు, వైఢూర్యాలు వంటి ఎంతో విలువైన సంపద ఉన్నా.. ఇప్పటికీ సమాచారం స్పష్టంగా తెలియడం లేదు. చివరి సారిగా 1985లో రత్న భాండాగారాన్ని లెక్కించినట్లు తెలుస్తోంది. 

అధికారవర్గం పూర్తి నిర్లక్ష్యం
శ్రీ జగన్నాథుని అమూల్య రత్న సంపద నిర్వహణపై అధికార వర్గం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికార వర్గాల వ్యతిరేకంగా కఠిన చర్యలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించాలని పిటిషనరు అభ్యర్థించారు. అధికారులందరినీ ప్రశ్నించాలని కోరారు. తాళం చెవి గల్లంతు సంఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీ నియమించి.. రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని విన్నవించారు. క్షేత్ర స్థాయిలో ఈ కమిటీ విచారణ జరిపి రత్న భాండాగారంలో అలనాటి రత్న సంపద, ప్రస్తుతం రత్న సంపద గణాంకాల్ని సమీక్షిస్తే వాస్తవ స్థితిగతులు స్పష్టమవుతాయన్నారు. సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థిస్తు హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక కమిటి విచారణని అభ్యర్థించడం విశేషం. ఈ కేసులో 10 మందిని కక్షిదారులుగా నమోదు చేశారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు, కలెక్టరు, శ్రీ జగన్నాథ మందిరం పాలక వర్గం ఉపాధ్యక్షుడు, శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి – సీఏఓ, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రముఖ ప్రత్యర్థులుగా పేర్కొన్నారు. 

తాళం గల్లంతుపై కమిషన్‌
∙జస్టిస్‌ రఘువీర్‌ దాస్‌ అధ్యక్షతన నియామకం
భువనేశ్వర్‌: జగన్నాథుని రత్న భాండాగారం తాళం చెవి గల్లంతైన సందర్భంగా జస్టిస్‌ రఘువీర్‌ దాస్‌ న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసింది. హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రఘువీర్‌ దాస్‌ అధ్యక్షతన ఏర్పాటైన న్యాయ కమిషన్‌ తాళం చెవి గల్లంతుకు సంబంధించి 3 నెలల వ్యవధిలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతవడంతో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ న్యాయ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు న్యాయ విచారణ పట్ల పెదవి విరిచి భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top