
ఒక్కో నిరుద్యోగికి 62 వేలు బకాయి
ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం రూ. 62 వేలు బకాయి పడిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి.. ఆ హామీని కూడా తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 31 నెలలైనందున.. నెలకు రూ. 2 వేల చొప్పున ప్రతి నిరుద్యోగికి రూ. 62 వేలు బకాయి పడ్డారని భూమన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మొత్తం రూ. లక్షా 8 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఏ ఒక్క నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా.. పెద్ద నిరుద్యోగి అయిన లోకేష్‌కు లక్షా 8 వేల కోట్ల కంటే ఎక్కువ మేలు ప్రభుత్వం చేసిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల హామీలు, ప్రసంగాలను యూ ట్యూబ్ నుంచి తొలగించడం వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వెబ్‌సైట్ నుంచి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తొలగించారన్నారు. 'మీరిచ్చిన వాగ్దానాలు, ప్రకటనలు టీడీపీ కార్యాలయానికి పంపుతాం.. చదివి సిగ్గుతో తలదించుకోండి' అని భూమన ధ్వజమెత్తారు.