డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం అన్నదమ్ముళ్లు అళగిరి, స్టాలిన్‌ల మధ్య ఏళ్ల తరబడి వివాదం సాగుతోంది.
మాటల యుద్ధం
Jan 29 2014 2:48 AM | Updated on Sep 2 2017 3:06 AM
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం అన్నదమ్ముళ్లు అళగిరి, స్టాలిన్‌ల మధ్య ఏళ్ల తరబడి వివాదం సాగుతోంది. ఇది ముదిరి పాకాన పడడంతో డీఎంకే అధిష్టానం కన్నెర్ర చేసింది. అళగిరిని తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో అళగిరి వర్గం తీవ్ర ఆక్రోశంతో రగిలిపోతోంది. తదుపరి తన కార్యాచరణను ఈనెల 31న ప్రకటించేందుకు అళగిరి సిద్ధం అవుతోన్నారు. దక్షిణాది జిల్లాల్లోని మద్దతుదారుల ను ఏకం చేసి మదరై వేదికగా మంతనాల్లో మునిగి పోయూరు. అదే సమయంలో అళగిరిని సస్పెండ్ చేసిన రోజు గోపాలపురంలో ఏమి జరిగింది? అని తెలుసుకోవడానికి మీడియా తీవ్ర ప్రయత్నాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం అధినేత ఎం కరుణానిధి అళగిరిపై విరుచుకు పడ్డారు.
ఆవేశ పరుడు: అళగిరి ఆవేశ పరుడు అని కరుణానిధి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అళగిరి తాజా చర్యల్ని ఎండ గడుతూ, ఈనెల 24వ తేదీ ఉదయం తన ఇంట్లో ఏమి జరిగిందోనన్న విషయాన్ని వెల్లడించారు. ఆరోజు ఉదయాన్నే అళగిరి తీవ్ర ఆవేశంతో గోపాలపురంలోని తన ఇంట్లోకి వచ్చారని, వచ్చీ రాగానే పత్రికల్లో రాయలేనంతగా పదజాలం ఉపయోగించారని వివరించారు. తాను పడక గదిలో బెడ్ మీద నుంచి కూడా లేవకుండానే అళగిరి వ్యవహరించిన తీరు మనో వేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. తన చిన్న కుమారుడు స్టాలిన్‌ను తీవ్ర పదజాలంతో దూషించడంతో తనలో ఆక్రోశాన్ని రగిల్చిందన్నారు. కుటుంబం అన్న విషయాన్ని పక్కన పెట్టి, పార్టీ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని స్టాలిన్‌పై అళగిరి చేసిన వ్యాఖ్యలు తనను జీర్ణించుకోలేకుండా చేశాయన్నారు. ఆయన వ్యాఖ్యల్లో చచ్చిపోతారు అన్న అర్థం వచ్చేలా ఉన్నాయన్నారు. కార్యకర్తలను ఏ నాయకుడు తిట్టినా, తాను ఊరుకోనని, అలాంటప్పుడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కోశాధికారి, తన చిన్న కుమారుడిని నానా మాటలనడంతో తాను స్పందించాల్సి వచ్చిందన్నా రు. అళగిరి ఆగడాలకు కళ్లెం వేయడం లక్ష్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. కరుణానిధి అలా వ్యాఖ్యలు చేశారో లేదో, ఇలా అళగిరి మదురైలో స్పందించారు. అవన్నీ అబద్ధాలేనని, తనపై అభాండాలు వేస్తున్నారని పేర్కొన్నారు.
ఆ వ్యాఖ్యలే కానుక: తనను తొలగించిన సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ కొన్ని కారణాలు ప్రకటించారని గుర్తు చేశారు. తాజాగా తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవంగా కొట్టి పారేశారు. ఆయన మోపిన ఆభాండాలను పుట్టినరోజు శుభాకాంక్షల కానుకగా స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీలోని రాజకీయం, జిల్లాల్లో నాయకులకు జరుగుతున్న అన్యాయం గురించి పదే పదే అరివాళయంకు ఫిర్యాదులు చేసినా, అవి అధినేతకు చేరడం లేదన్నారు. అందుకే తాను స్వయంగా ఆ రోజున కరుణానిధిని కలుసుకుని ఆధారాలతో చూపిస్తే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను పార్టీ సంయుక్త కార్యదర్శి దురై మురుగన్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు. అయితే, తానేదో ఆవేశంతో ఊగిపోయినట్టు, తీవ్ర పదజాలాల్ని ఉపయోగించినట్టు కరుణానిధి పేర్కొనడం మనోవేదనకు గురి చేస్తున్నదన్నారు.
నా తమ్ముడు: స్టాలిన్ తమ్ముడు అని, అందరూ కుటుంబ సభ్యులు అన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే సస్పెండ్‌ను కానుకగా ఇచ్చారన్నారు. ఇప్పుడేమో జన్మదిన కానుకగా తాజా ఆరోపణలు సంధించారని, ఎవరెన్ని ఆరోపణలు చేసినా, కుట్ర లు పన్నినా, తాను మాత్రం కార్యకర్తల వెంటేనని, మద్దతుదారుల కోసం ఎంత కైనా సిద్ధం అని స్పష్టం చేశారు. చచ్చిపోతారన్నట్టు ఏదో వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తూ, ఆయన వందేళ్లు జీవించాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ‘‘చిట్ట చిరవగా ఒకటే చెబుతున్నా, నాకు కరుణానిధి ముఖ్యం... ఆయన కంటే ముందే చచ్చిపోవాలని భావించేవాడిని నేను. నా భౌతిక కాయంపై ఆయన కన్నీళ్లు పడాలన్నదే నా కోరిక.’’ అని చెమ్మగిల్లిన కళ్లతో ఉద్వేగంగా వ్యాఖ్యానించి ముగించారు.
Advertisement
Advertisement