బడ్జెట్ రూపకల్పనలో ఆప్ సర్కారు వినూత్న ప్రయోగం చేయనుంది. కొత్త బడ్జెట్ తయారీలో సాధారణ ప్రజలకు సైతం పాత్ర కల్పించనుంది.
	 ఢిల్లీవాసులకు పాత్ర కల్పించనున్న ఆప్ సర్కారు
	 
	 సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ రూపకల్పనలో ఆప్ సర్కారు వినూత్న ప్రయోగం చేయనుంది. కొత్త బడ్జెట్ తయారీలో సాధారణ ప్రజలకు సైతం పాత్ర కల్పించనుంది. అందువల్ల్ల విభిన్న ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2015- 2016 వార్షిక బడ్జెట్‌ను నగరవాసుల సలహాలతో రూపొందించాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం విధానసభలో ఈ విషయం చెప్పారు. ప్రజల అవసరాలను బట్టి బడ్జెట్ రూపొందిస్తామని, బడ్జెట్‌పై ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకున్న తరువాత శాసనభ్యులు దానిని సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. ప్రయోగాత్మకంగా బడ్జెట్ తయారీ ప్రాజెక్టును 10-15 నియోజకవర్గాలలో చేపట్టనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
	 
	 విభిన్న విభాగాలను బడ్జెట్ నిధులు కేటాయించడానికి బదులు తమ బడ్జెట్ ఎలా ఉండాలనుకుంటున్నారో తెలపాల్సిందిగా స్థానికులనే కోరుతామని ఆయన చెప్పారు. ఒక్కో నియోజకవర్గాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసి ప్రజల ఫిర్యాదులు, డిమాండ్లను తెలుసుకుని వాటిని ససభకు సమర్పిస్తామన్నారు. బడ్జెట్ దిశను ప్రజలు  నిర్ణయిస్తారన్నారు. తమ తమ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు  కోటా నిధులలను ఏవిధంగా వెచ్చించాలనే అంశంపై ప్రజల అభిప్రాయానికి తావు ఉండాలన్నారు. ప్రజలకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలనేదే ఈ ప్రయత్నంలోని ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు.  ప్రతిభకు ప్రోత్సాహం: అత్యుత్తమ ప్రణాళికలను సమర్పించే అధికారులను కూడా ప్రభుత్వం సత్కరించాలనుకుంటోంది.
	 
	  ఇంతవరకు అధికారులకు తమ ప్రతిభను చాటకునే అవకాశం రాలేదని కేజ్రీవాల్ చెప్పారు. తాము త్వరలో లక్ష్యాలను నిర్దేశించి, ప్రకటిస్తామని, ఈ లక్ష్యాల సాధన కోసం సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అత్యుత్తమ ప్రణాళిక రూపొందించిన అధికారికి ప్రణాళికను అమలుచేసే బాధ్యతను అప్పగించే ఉద్యోగ గడువును నిర్ధారించనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.  త్వరలో శ్వేతపత్రం: విద్యుత్తు రంగంపై త్వరలో శ్వేతపత్రం సమర్పించనున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. 15 సంవత్సరాలుగా విద్యత్తు రంగం ప్రయివేటు సంస్థల చేతుల్లో ఉందన్నారు. ఈ రంగ స్థితిగతులు ఏమిటో ఢిల్లీవాసులకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
