ఊసురు తీసిన ‘టీవీ’ | A young woman committed suicide TV program | Sakshi
Sakshi News home page

ఊసురు తీసిన ‘టీవీ’

Oct 17 2013 1:43 AM | Updated on Sep 1 2017 11:41 PM

సందేశాత్మక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన టెలివిజన్ కార్యక్రమాలు పక్కదారి పట్టాయి. పాఠ్య పుస్తకాల్లో మనసును నిమగ్నం చేసుకునే వయసులో ఉన్న చిన్నారుల

క్రిష్ణగిరి, న్యూస్‌లైన్ : సందేశాత్మక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన టెలివిజన్ కార్యక్రమాలు పక్కదారి పట్టాయి. పాఠ్య పుస్తకాల్లో మనసును నిమగ్నం చేసుకునే వయసులో ఉన్న చిన్నారుల హృదయాలను టెలివిజన్‌లో ప్రసారమయ్యే వినోదభరిత కార్యక్రమాలు కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం ఎంటర్‌టైన్ మెంట్ ప్రోగ్రాంను చూసేందుకు అక్కాచెల్లెళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుని చివరకు అక్క ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

క్రిష్ణగిరిలోని ఆర్‌ఎస్ లక్ష్మిపురం ప్రాంతానికి చెందిన మురుగేశన్(వ్యాపారి), నాగలక్ష్మి(టీచర్) దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు నివేద(20), స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ రెండవ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. నివేద చెల్లెలు హరిత్ ఇంటర్మీడియట్ చదువుతోంది. నిత్యం తన వ్యాపార కేంద్రానికి మురుగేశన్, విధులకు నాగలక్ష్మి వెళ్లి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు.

ఈ నేపథ్యంలో కళాశాల నుంచి తొందరగా ఇంటికి చేరుకునే అక్కాచెల్లెలు, టెలివిజన్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలను చూసేందుకు అలవాటు పడిపోయారు. దీంతో తమకిష్టమైన కార్యక్రమాన్ని చూసేందుకు ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకునేది. చివరకు రిమోట్‌ను గిరాటేసి కోపంతో గదిలోకి వెళ్లి తలుపులు బిడాయించుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం ఇంటికి తొందరగా చేరుకున్న హరిత్, టెలివిజన్‌లో తనకిష్టమైన కార్యక్రమాన్ని చూస్తూ కూర్చొంది. నాలుగు గంటల సమయంలో నివేద ఇంటికి చేరుకుంది.

ఆ సమయంలో తన చెల్లెలు చేతిలో ఉన్న రిమోట్‌ను లాక్కొని తనకిష్టమైన చానల్ పెట్టుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఇందుకు హరిత్ సహకరించలేదు. రిమోట్ కోసం ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన నివేద మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.  కొద్ది సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లి, అక్కా చెల్లెలు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తెలుసుకుని నివేదను సముదాయించేందుకు గది వద్దకు చేరుకుంది. ఎంత సేపు పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో కిటికి తలుపులు తీసి చూశారు.

లోపల ఫ్యాన్‌కు నివేద వేలాడుతూ కనిపించింది.  చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకె వెళ్లి, నివేదను కిందకు దించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. క్రిష్ణగిరి టౌన్ పోలీ సులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
 

Advertisement

పోల్

Advertisement