breaking news
Television programs
-
ఇప్పుడు వీరు... వచ్చే యేడు ఎవరో!
టీవీక్షణం పాత ఏడాది ముగిసిపోయి, కొత్త ఏడాది వస్తుంటే... పాతవి మిస్ అయ్యి, కొత్తవి వస్తాయి అనుకుంటారు. టెలివిజన్ ప్రేక్షకులకు ఆ బాధుండదు. సక్సెస్ఫుల్ టీవీ షోలు జనం చూసినంతకాలం సాగుతూనే ఉంటాయి. 2013లో బుల్లితెర జనాలను బాగానే కట్టి పడేసింది. అన్ని భాషా చానెళ్లూ ప్రేక్షకులను అలరించినా... హిందీ చానెళ్లు ప్రేక్షకులని పూర్తిగా తమ బుట్టలో వేసేసుకున్నాయి. దానికి కారణాలు రెండు. మొదటిది క్వాలిటీ, రెండోది ఎప్పటికప్పుడు కొత్తగా ఉండటం. గమనించి చూస్తే ఈ యేడు హిందీ చానెళ్లలోకి మహామహులు ప్రవేశించారు. ముఖ్యంగా సినీరంగంలోని వారు ఎంటరై దుమ్ము దులిపి పారేశారు. వారిలో ముఖ్యులు ముగ్గురు... అనిల్‌కపూర్, శేఖర్‌కపూర్, సంజయ్‌లీలా భన్సాలీ. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శేఖర్ కపూర్ ఏబీపీ న్యూస్ చానెల్లో ‘ప్రధాన్‌మంత్రీ’ అనే ప్రోగాముకి హోస్టుగా బుల్లితెర ప్రవేశం చేశారీ యేడు జూలైలో. అద్భుతమైన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అనిల్ కపూర్ 24 అనే డిఫరెంట్ టెక్నిక్‌తో కలర్స్ చానెల్లో అడుగుపెట్టారు. టైస్టు బ్యాగ్రౌండుతో సీరియల్ చేశారు. సక్సెస్ అయ్యారు. మూడో వ్యక్తి... సంజయ్‌లీలా భన్సాలీ. భన్సాలీ ఎంత గొప్ప సినిమాలు తీశారో తెలియంది కాదు. అలాంటివ్యక్తి టీవీ సీరియల్ తీస్తుంటే ఆసక్తి ఉంటుంది కదా! అదే ‘సరస్వతీచంద్ర’ సీరియల్‌కి బలం. సినిమాల్లోంచి వచ్చిన ఈ ముగ్గురూ ఈ యేడు సెన్సేషన్ సృష్టించడం విశేషం. వచ్చే యేడు కూడా జయాబచ్చన్ వంటి కొందరు సినీ ప్రముఖులు టెలివిజన్ రంగంలో అడుగిడబోతున్నారు. మరి వాళ్లేం సెన్సేషన్లు క్రియేట్ చేస్తారో చూడాల్సిందే! -
ఊసురు తీసిన ‘టీవీ’
క్రిష్ణగిరి, న్యూస్‌లైన్ : సందేశాత్మక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన టెలివిజన్ కార్యక్రమాలు పక్కదారి పట్టాయి. పాఠ్య పుస్తకాల్లో మనసును నిమగ్నం చేసుకునే వయసులో ఉన్న చిన్నారుల హృదయాలను టెలివిజన్‌లో ప్రసారమయ్యే వినోదభరిత కార్యక్రమాలు కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రాంను చూసేందుకు అక్కాచెల్లెళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుని చివరకు అక్క ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... క్రిష్ణగిరిలోని ఆర్ఎస్ లక్ష్మిపురం ప్రాంతానికి చెందిన మురుగేశన్(వ్యాపారి), నాగలక్ష్మి(టీచర్) దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు నివేద(20), స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ రెండవ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. నివేద చెల్లెలు హరిత్ ఇంటర్మీడియట్ చదువుతోంది. నిత్యం తన వ్యాపార కేంద్రానికి మురుగేశన్, విధులకు నాగలక్ష్మి వెళ్లి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు. ఈ నేపథ్యంలో కళాశాల నుంచి తొందరగా ఇంటికి చేరుకునే అక్కాచెల్లెలు, టెలివిజన్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలను చూసేందుకు అలవాటు పడిపోయారు. దీంతో తమకిష్టమైన కార్యక్రమాన్ని చూసేందుకు ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకునేది. చివరకు రిమోట్‌ను గిరాటేసి కోపంతో గదిలోకి వెళ్లి తలుపులు బిడాయించుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం ఇంటికి తొందరగా చేరుకున్న హరిత్, టెలివిజన్‌లో తనకిష్టమైన కార్యక్రమాన్ని చూస్తూ కూర్చొంది. నాలుగు గంటల సమయంలో నివేద ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో తన చెల్లెలు చేతిలో ఉన్న రిమోట్‌ను లాక్కొని తనకిష్టమైన చానల్ పెట్టుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఇందుకు హరిత్ సహకరించలేదు. రిమోట్ కోసం ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన నివేద మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లి, అక్కా చెల్లెలు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తెలుసుకుని నివేదను సముదాయించేందుకు గది వద్దకు చేరుకుంది. ఎంత సేపు పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో కిటికి తలుపులు తీసి చూశారు. లోపల ఫ్యాన్‌కు నివేద వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకె వెళ్లి, నివేదను కిందకు దించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. క్రిష్ణగిరి టౌన్ పోలీ సులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.