యాదాద్రి జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ రిజిస్ట్రేషన్లు : 15 మంది అరెస్ట్
Dec 3 2016 2:57 PM | Updated on Sep 4 2017 9:49 PM
చౌటుప్పల్: యాదాద్రి జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా నగదు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీబీనగర్ మండలం రాఘవపురంలో వ్యాస్ అనే ఎన్‌ఆర్‌ఐకు 24 ఎకరాల స్థలం ఉంది. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రభుత్వంతో అంగీకారం చేసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుని హైదరాబాద్‌లోని మారేడుపల్లిలో ఉంటున్నారు. అయితే ఆ స్థలంపై కొందరి కన్నుపడింది.
మహేష్ అనే వ్యక్తి ఎన్‌ఆర్‌ఐ తీరులో జితేందర్ కుమార్ భండారి అనే వ్యక్తిని స్థలం యజమాని అంటూ గ్రామస్తులకు పరిచయం చేశాడు. మహేష్ మరో 21 మంది ముఠాగా ఏర్పడి డాక్యుమెంట్ రైటర్ ద్వారా నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడు. విషయం తెలిసిన అసలు ఎన్‌ఆర్‌ఐ వారం క్రితం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి జరిగిన మోసాన్ని తెలుసుకుని రాచకొండ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 15 మంది యువకులను అరెస్టు చేశారు. వీరినుంచి రూ. 8 లక్షల నగదు, పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురిని పట్టుకోవాల్సి ఉందని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement