ప్రతీకారం తీర్చుకుంటారా! | Zimbabwe today in the second T20 match | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకుంటారా!

Jun 19 2016 11:38 PM | Updated on Sep 4 2017 2:53 AM

ప్రతీకారం తీర్చుకుంటారా!

ప్రతీకారం తీర్చుకుంటారా!

వన్డేల తరహాలోనే టి20లను చుట్టేస్తామని భావించిన భారత్‌కు జింబాబ్వే అనూహ్యంగా షాక్ ఇచ్చింది.

విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్ 
►  ఆత్మవిశ్వాసంతో జింబాబ్వే  నేడు రెండో టి20 మ్యాచ్

 
వన్డేల తరహాలోనే టి20లను చుట్టేస్తామని భావించిన భారత్‌కు జింబాబ్వే అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఇప్పుడు దానినుంచి కోలుకొని సిరీస్‌ను సమం చేయాల్సిన స్థితిలో ధోని సేన నిలిచింది. తొలి మ్యాచ్‌లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా టీమిండియా తమ అసలు ఆట ప్రదర్శిస్తుందా... లేక జింబాబ్వే గత మ్యాచ్ జోరును కొనసాగిస్తుందా చూడాలి.
 
 
హరారే: పేరుకు పూర్తి స్థాయి జట్టు కాకపోరుునా, ఇదే జట్టు వన్డే ఫామ్‌ను చూస్తే  జింబాబ్వే చేతిలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20ల్లో జింబాబ్వే సంచలనం నమోదు చేసింది. అయితే తొలి మ్యాచ్‌కు ప్రతీకారంపై టీమిండియా దృష్టి పెట్టింది. గత మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెట్టి తమ స్థాయి ప్రదర్శనతో సిరీస్‌లో నిలబడాలని భారత్ పట్టుదలగా ఉంది.  గతంలో ఒక్కసారి కూడా ఏ జట్టుపైనా టి20 సిరీస్ నెగ్గని జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. భారత్‌పై తొలిసారి సిరీస్ నెగ్గాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు (సోమవారం) రెండో టి20 మ్యాచ్ జరగనుంది.  


 మార్పులు ఉంటాయా...
తొలి మ్యాచ్‌లో భారత్ ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు తొలి మ్యాచ్ అవకాశం ఇచ్చింది. వీరిలో మన్‌దీప్ సింగ్ ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్ ప్రదర్శనను బట్టి రాహుల్, చహల్‌లకు కూడా మరో అవకాశం దక్కవచ్చు. ఉనాద్కట్, రిషి ధావన్ మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఒక్క మ్యాచ్‌కే వీరిని పరిమితం చేస్తారా, లేక మరో అవకాశం ఇస్తారా చూడాలి. వీరి స్థానంలో బరీందర్ లేదా ధావల్ కులకర్ణి రావచ్చు. భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే ప్రధాన బ్యాట్స్‌మెన్ నుంచి మరింత మంచి ప్రదర్శన రావాలి.

జట్టు బ్యాటింగ్ ప్రధానంగా మనీశ్ పాండేతో పాటు అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లపై ఆధార పడి ఉంది. ఐపీఎల్‌లో మెప్పించిన రాహుల్ తొలి మ్యాచ్ వైఫల్యం నుంచి బయటపడి మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. జింబాబ్వే పర్యటనలో ఇప్పటివరకు మ్యాచ్ అవకాశం దక్కని ఒకే ఒక ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్. అయితే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ధోని మరో కొత్త ఆటగాడిపై నమ్మకం ఉంచే అవకాశం లేదు.


 ఒక మార్పుతో...
తొలి మ్యాచ్ గెలిచిన జింబాబ్వేలో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. గత ఏడాది భారత్‌పై టి20 మ్యాచ్ విజయం స్ఫూర్తిగా ఈసారి కూడా శుభారంభం చేసిన ఆ జట్టు మరొక్క విజయం సాధిస్తే చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఓపెనింగ్ జోడి చిబాబా, మసకద్జా మరోసారి శుభారంభం ఇవ్వాలని జట్టు కోరుకుంటోంది. మరో టాపార్డర్ బ్యాట్స్‌మన్ ముతుంబామి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కాగా, అతని స్థానంలో పీటర్ మూర్ జట్టులోకి రానున్నాడు. ఇక తొలి మ్యాచ్‌తో హీరోగా మారిన చిగుంబురా మళ్లీ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ పర్యటనలో ఇప్పటి వరకు ఆకట్టుకోని మరో ప్రధాన బ్యాట్స్‌మన్ సికందర్ రజా ఫామ్‌లోకి వచ్చేందుకు ఇది మంచి అవకాశం. బౌలింగ్‌లో ముజరబని, తిరిపానోలు కీలకం కానున్నారు. ముఖ్యంగా జింబాబ్వేను గెలిపించిన చివరి ఓవర్ బౌలర్ మద్జివ మరోసారి రాణించాలని పట్టుదలగా ఉన్నాడు.


తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రాహుల్, మన్‌దీప్, రాయుడు, పాండే, జాదవ్, అక్షర్, ధావన్/ధావల్, చహల్, బుమ్రా, ఉనాద్కట్/బరీందర్. జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), మసకద్జ, చిబాబా, మూర్/మరుమా, రజా, వాలర్, చిగుంబురా, ముతుంబోజి, మద్జివ, ముజరబని, తిరిపానో.
 
సా.గం. 4.30 నుంచి టెన్-2, డీడీ నేషనల్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement