కైఫ్‌ రికార్డును సమం చేసిన వోక్స్‌

World Cup 2019 Pakistan and Woakes set ODI records - Sakshi

నాటింగ్‌హామ్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. స్థానిక ట్రెంట్‌ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వోక్స్‌ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. ఇందులో ఓ క్యాచ్‌ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో వోక్స్‌ ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు(4) పట్టిన ఫీల్డర్‌గా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ సరసన చేరాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్‌ మూడు కీలక వికెట్లు పడగొట్టడం విశేషం.

పాక్‌ సరికొత్త రికార్డు
ఇక పాక్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌(63‌), హఫీజ్‌ ‌(84), సర్పరాజ్‌ అహ్మద్‌(55)లు రాణించడంతో పాక్‌ 348 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అయితే ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ సెంచరీ చేయనప్పటికీ భారీ స్కోర్‌ సాధించడంతో ప్రపంచకప్‌లో పాక్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. గత వరల్డ్‌కప్‌లో యూఏఈపై దక్షిణాఫ్రికా జట్టులో ఎవరూ శతకం సాధించకుండానే 341 పరుగుల చేసింది. ఇదే ఇప్పటివరకు అత్యుత్తం కాగా ఆ రికార్డును తాజాగా పాక్‌ బద్దలుకొట్టింది.

గెలిస్తే ఇంగ్లండ్‌ రికార్డే..
పాకిస్తాన్‌ నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే ఇంగ్లండ్‌ సరికొత్త రికార్డును సృష్టిస్తుంది. ప్రపంచకప్‌లో 329 పరుగుల ఛేజింగే ఇప్పటివరకు అత్యుత్తమం. అది కూడా 2011 ప్రపంచకప్‌ సందర్భంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును ఇంగ్లండ్‌ సాధించింది. అయితే ప్రపంచకప్‌కు ముందు పాక్‌తో జరిగిన సిరీస్‌లో భారీ లక్ష్యాలను అవలీలలగా ఛేదించిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top