మయాంక్‌ అరంగేట్రం.. జడేజా డౌటే?

World Cup 2019 Mayank Agarwal Set For ODI Ddebut - Sakshi

లీడ్స్‌: బంగ్లాదేశ్‌పై గెలిచి సగర్వంగా ప్రపంచకప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. లీగ్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కీలక సెమీఫైనల్‌కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వకపోవడమే మంచిదని మేనేజ్‌మెంట్‌ భావిస్తొంది. అయితే అనూహ్యంగా జట్టులోకి వచ్చిన కర్ణాటక ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ శ్రీలంక మ్యాచ్‌లో ప్రపంచకప్‌లోనే వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోని దినేశ్‌ కార్తీక్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.

మయాంక్‌ను ఓపెనర్‌గా పంపించి కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని జట్టు ఆలోచిస్తోంది. రిషభ్‌ పంత్‌ ఐదు లేక ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే మయాంక్‌ ఏకంగా ప్రపంచకప్‌లోనే అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా టీమిండియాకు సేవలందించిన రవీంద్ర జడేజాకు శ్రీలంక మ్యాచ్‌లోనూ నిరాశ తప్పకపోవచ్చు. ఒకవేళ కోహ్లి శ్రీలంక మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే జడేజా తుదిజట్టులో ఉంటాడు.

శ్రీలంక మ్యాచ్‌ కోసం మేనేజ్‌మెంట్‌ ప్రత్యేకంగా మిడిలార్డర్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మిడిలార్డర్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. టాపార్డర్‌ రాణింపుతోనే నెట్టుకు రాగలిగింది. అయితే సెమీఫైనల్‌, ఫైనల్‌ వంటి మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌ కీలకం కానుంది. దీంతో మిడిలార్డర్‌ రాణించాలని మేనేజ్‌మెంట్‌తో సహా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సెమీఫైనల్లో వివిధ టీమ్‌ల ప్రస్తుత ఫామ్‌ ఆధారంగా ఇంగ్లండ్‌తోనే టీమిండియా తలపడే అవకాశం కనిపిస్తోందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top