మనదే పైచేయి

Windies Not Winning ODI Series In India After 2002 - Sakshi

2002 తర్వాత భారత్‌లో వన్డే సిరీస్‌ నెగ్గని విండీస్‌

పుష్కరకాలంగా ఎదురులేని టీమిండియా

ఈసారీ సూపర్‌ ఫామ్‌లో కోహ్లి సేన

సీజన్‌లో చివరి వన్డే సిరీస్‌కు సిద్ధం

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌నే శాసించిన వెస్టిండీస్‌...80వ దశకంలో భారత్‌పై కూడా గర్జించింది. కానీ ఆ తర్వాత సీన్‌ మారింది. భారత్‌ గేర్‌ మార్చుకుంది. వన్డేల్లో సొంత గడ్డపై కరీబియన్‌ను మట్టికరిపిస్తూనే ఉంది. గడిచిన పుష్కర కాలంగా 4 వన్డేల సిరీస్‌ జరిగినా... 5 వన్డేల్లో తలపడినా... 3 వన్డేలు... ఇలా సిరీస్‌ ఏదైనా విజేత మాత్రం భారతే. అంతగా రాటుదేలింది టీమిండియా.  

 సాక్షి క్రీడా విభాగం: వెస్టిండీస్‌ ఇటు వన్డేల్లో, అటు టి20ల్లో రెండేసి సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఒకప్పుడు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో, ఎదురుదాడి బ్యాటింగ్‌తో ప్రపంచ ప్రత్యర్థుల్నే వణికించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. తమ దీవుల్లో జరిగే కరీబియన్‌ లీగ్‌ పుణ్యమాని ఇప్పుడు టి20ల్లో సత్తా చాటుతున్నప్పటికీ... వన్డేల్లో మాత్రం నిలకడలేని ఆటతీరుతో చతికిలబడుతోంది. అలనాడు భారత్‌లోనూ విండీస్‌ది అద్భుతమైన రికార్డు. 1983 సీజన్‌లో ఇక్కడ ఐదు వన్డేల సిరీస్‌ను 5–0తో, 1987 సీజన్‌లో ఏడు వన్డేల సిరీస్‌ను 6–1తో గెలిచిన అసాధారణ జట్టు వెస్టిండీస్‌. కానీ ఆ తర్వాత... మళ్లీ ఆడేందుకు ఇక్కడికి వస్తే మాత్రం కరీబియన్‌ సిరీస్‌లు కాదు కదా... మ్యాచ్‌లు గెలిచేందుకే ఆపసోపాలు పడుతోంది.  

90 దశకంలో భారత్‌ ఆధిపత్యం...
ప్రపంచ వ్యాప్తంగా వెస్టిండీస్‌ 80వ దశకంలో ఎక్కడ ఆడినా గెలిచేది. కానీ 90 నుంచి తిరోగమనం మొదలైంది. భారత్‌ పైచేయి సాధించడం కూడా ప్రారంభమైంది. కరీబియన్‌తో ముఖాముఖి సిరీస్‌లతో పాటు, విండీస్‌ ఆడేందుకు వచి్చన హీరో కప్‌ (1993), విల్స్‌ వరల్డ్‌ సిరీస్‌ (1994)లలో భారతే విజేతగా నిలిచింది. సొంతగడ్డపై భారత్‌ గర్జిస్తుంటే బ్యాటింగ్‌ దిగ్గజం లారా, బౌలింగ్‌ లెజెండ్స్‌ వాల్‌‡్ష, అంబ్రోస్‌లు ఉన్న విండీస్‌ జట్టు ఏమీ చేయలేకపోయింది. రిక్తహస్తాలతోనే తిరుగుముఖం పట్టేది. దీంతో ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్‌ స్వర్ణయుగం కరిగిపోయింది. తర్వాత ఓ మామూలు జట్టుగా మిగిలిపోయింది. ఆటగాళ్ల వైఫల్యం, బోర్డు రాజకీయాలు, కాంట్రాక్టు వివాదాలు, సంక్షోభం ఇలా అన్నింటితో సతమతమై ఇప్పుడు కొన్ని మెగా టోర్నీల్లో క్వాలిఫయింగ్‌ ఆడే పరిస్థితికి దిగజారింది.

12 ఏళ్లుగా టీమిండియాదే విక్టరీ...
గుడ్డిలో మెల్లగా వెస్టిండీస్‌ను దశాబ్దాల తర్వాత 2002 సీజన్‌ ఆదుకుంది. ఆ ఏడాది భారత్‌కు వచ్చిన విండీస్‌ మొదట టెస్టు సిరీస్‌ ఓడిపోయినా... సుదీర్ఘంగా సాగిన ఏడు వన్డేల సిరీస్‌లో టీమిండియాను భారత గడ్డపై 4–3తో కంగుతినిపించింది. క్రిస్‌ గేల్‌ రెండు శతకాలతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత భారత్‌లో ముఖాముఖి వన్డే సిరీస్‌కు రావడం, ఓడిపోవడం రివాజుగా జరిగేవి. 2007 నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు భారతగడ్డపై అడుగుపెట్టిన కరీబియన్‌ జట్టు పరాజయంతోనే తిరుగు పయనమైంది. 2007తో పాటు 2011, 2013, 2014, 2018దాకా ఇరు జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. ఈ ఐదు సిరీస్‌లలోనూ ప్రత్యర్థి జట్టు ఒక మ్యాచ్‌కు మించి గెలవలేకపోవడం భారత ఆధిపత్యానికి నిదర్శనం. ఒకటేమో ‘టై’ అయింది.  

ఈసారి వన్డే సిరీస్‌లోనూ కోహ్లి సేనే ఫేవరెట్‌
కొన్నాళ్లుగా భారత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవలే ముగిసిన టి20 సిరీస్‌లోనూ భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రతాపం తెలిసిందే. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దుర్భేద్యంగా తయారైంది. రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్, విరాట్‌ కోహ్లి ఈ ముగ్గురు నిలబడితే ఎంతటి బౌలింగ్‌ అయినా చెల్లాచెదురు కావాల్సిందే. గత ఆఖరి టి20లో విండీస్‌ బౌలర్లకు ఇది బాగా గుర్తయింది. ఇక బౌలింగ్‌లోనూ షమీ, దీపక్‌ చాహర్‌ పేస్‌కు కుల్దీప్, చహల్, జడేజాల స్పిన్‌ అండ ఉండనే ఉంది. ఎటొచ్చి జట్టు మేనేజ్‌మెంట్‌ బెంగంతా మిడిలార్డర్, ఫీల్డింగ్‌లపైనే ఉంది. పొట్టి క్రికెట్‌లో భారత ఫీల్డర్లు పదేపదే క్యాచ్‌ల్ని నేలపాలు చేశారు. అదే విధంగా నిలకడలేని మిడిలార్డర్‌ వైఫల్యంతోనే రెండో టి20ని కోల్పోయింది. ఈ రెండు విభాగాలపై జట్టు సహాయ సిబ్బంది కన్నేస్తే భారత జోరుకు తిరుగుండదు.

మీకు తెలుసా...
ఈ ఏడాది భారత్‌ బాగానే ఆడినట్లు కనిపించింది. వరుసబెట్టి సిరీస్‌ల్లో పాల్గొంటుంది... గెలుస్తుంది. కానీ స్వదేశంలో మాత్రం ఒకే ఒక్క వన్డే సిరీస్‌ ఆడింది. అది మార్చిలో ఆ్రస్టేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ ఆడిన టీమిండియా అందులో 2–3తో ఓడింది. ఆ తర్వాత ఐపీఎల్, ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌లు ఆడింది. ఇక ఈ ఏడాది భారత్‌ ఆడే ఆఖరి వన్డే సిరీస్‌ ఇదే. దీన్ని విజయంతో ముగించాలని కోహ్లిసేన గట్టి పట్టుదలతో ఉంది.

గాయంతో భువనేశ్వర్‌ ఔట్‌

చెన్నై: భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మళ్లీ గాయపడ్డాడు. దీంతో వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ సీనియర్‌ సీమర్‌ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో అతని స్థానంలో యువ పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ను తీసుకునే అవకాశముంది. ఈ ఏడాది భువీని గాయాలు చికాకు పెడుతున్నాయి. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో అతను తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. పాక్‌తో మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడాల్సి వచి్చంది. మళ్లీ సెమీఫైనల్లో ఆడినప్పటికీ... తదనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన సిరీస్‌లకు అతను దూరమయ్యాడు. ఎట్టకేలకు విండీస్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌తో పునరాగమనం చేసిన అతను మళ్లీ వన్డేలకు దూరం కావడం జట్టు వర్గాలను ఆందోళన పరుస్తోంది. భువీ గాయంపై ఇంకా బోర్డు గానీ, జట్టు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌గానీ అధికారికంగా వెల్లడించలేదు.  

►55 వెస్టిండీస్‌తో స్వదేశంలో భారత జట్టు ఇప్పటివరకు 55 వన్డేలు ఆడింది. టీమిండియా 27 మ్యాచ్‌ల్లో... విండీస్‌ కూడా 27 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. మరో మ్యాచ్‌
‘టై’గా ముగిసింది.

►130 ఓవరాల్‌గా భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన వన్డేల సంఖ్య. భారత్‌ 62 మ్యాచ్‌ల్లో... విండీస్‌ కూడా 62 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగియగా... నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top