
నన్ను గానీ కొట్టవు కదా: నరేంద్ర మోదీ
సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించినప్పటి నుంచి ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.
సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించినప్పటి నుంచి ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను మాత్రం తాను మర్చిపోలేనని సాక్షి అంటోంది. సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకోవడానికి ఒక్క రోజు ముందు.. ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసింది. అప్పుడాయన.. ''ఇప్పుడు నన్ను గానీ కొట్టవు కదా'' అని సరదాగా అన్నారట. ఈ విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత సాక్షి మాలిక్ మీడియాకు చెప్పింది. ప్రధాని మీతో ఏం మాట్లాడారని అడిగినప్పుడు ఈ విషయం వెల్లడించింది. అప్పుడు మీ సమాధానం ఏంటని అడిగితే.. ''సర్, నేను మ్యాట్ మీద ఉన్నప్పుడు మాత్రమే రెజ్లర్‌ని. బయటకు వచ్చాక మామూలు ఆడపిల్లనే'' అని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది.
You are an inspiration for so many people @SakshiMalik. Keep making us proud with your achievements. #Rio2016 pic.twitter.com/aguBH7RhCg
— Narendra Modi (@narendramodi) 28 August 2016
రియో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి, భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వరుసపెట్టి జరుగుతున్న సన్మానాలు, సత్కారాలతో సాక్షి మాలిక్ బాగా అలిసిపోయింది. ఆ అలసట ఆమె ముఖం మీద కూడా కనపడుతోంది. అటూ ఇటూ తిరిగేటప్పుడు ప్రయాణాల్లోనే తాను నిద్రపోతున్నట్లు ఆమె చెప్పింది. గత పది రోజులుగా తిరుగుతూనే ఉన్నానని, కానీ దీన్ని మాత్రం జీవితంలో మర్చిపోలేనని తెలిపింది. సచిన్, సెహ్వాగ్ లాంటి లెజెండ్లను కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, వాళ్లను కలవడమే కష్టం అనుకుంటే ఏకంగా సచిన్ చేతుల మీదుగా బీఎండబ్ల్యు కారు తీసుకోవడం మరింత అదృష్టమని చెప్పింది. త్వరలోనే మళ్లీ తాను శిక్షణకు హాజరవుతానని, మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపింది.