మిథాలీ, జులన్‌ లేకపోవడం లోటే: హర్మన్‌

Will Miss Jhulan Goswami, Mithali Raj Experience In T20 World Cup 2020: Harmanpreet Kaur - Sakshi

యువ క్రికెటర్లతో సత్తా చాటుతాం

సిడ్నీ: భారత టి20 ప్రపంచకప్‌ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్‌ దిగ్గజాలు మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామిలు లేకపోవడం లోటేనని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. అయితే ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని 30 ఏళ్ల కెప్టెన్‌ పెర్కొంది. మిథాలీ, జులన్‌ ఇద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా ప్రస్తుత భారత మహిళల జట్టు పూర్తిగా యువ క్రికెటర్లతో ఉంది. ప్రస్తుత జట్టులో అమ్మాయిల సగటు వయసు 22.8 ఏళ్లే! ఇందులో ఒక్క హర్మన్‌ప్రీతే అందరికంటే సీనియర్‌. ఆస్ట్రేలియాలో ఈ నెల 21న మొదలయ్యే పొట్టి మెగా ఈవెంట్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు హర్మన్‌ సేన గత నెలలోనే కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. సన్నాహకంగా ఇంగ్లండ్, ఆసీస్‌లతో కలిసి ముక్కోణపు టి20 సిరీస్‌ ఆడింది. ప్రపంచకప్‌కు ముందు మీడియాతో కెప్టెన్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జట్టు సత్తా, సామర్థ్యంపై తన అభిప్రాయాలను వెల్లడించింది.

చక్కని కూర్పుతో.... 
‘ఇప్పటికే మేం ఇద్దరు అనుభవజ్ఞుల సేవల్ని కోల్పోయాం. ఆ లోటు పూడ్చలేనిది. ఇప్పుడు యువ ప్రతిభావంతులపైనే ఆధారపడ్డాం. వీరికి సత్తా చాటే సామర్థ్యం ఉంది. మా సహచరులెవరిలోనూ మేం అంతగా అనుభవం లేని యువ క్రికెటర్లం అనే భావనే లేదు. ఆశించిన స్థాయిలో వారంతా రాణిస్తున్నారు. జట్టు చక్కని కూర్పుతో ఉంది. జట్టుకు అవసరమైన రోజు శక్తికి మించి అదనపు భారం మోసేందుకు, బాధ్యతలు స్వీకరించేందుకు మా అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. రోజురోజుకీ మా జట్టు బాగా పటిష్టమవుతోంది’ అని హర్మన్‌ వ్యాఖ్యానించింది.

అప్పటి నిరాశ ఇప్పుడెందుకు... 
‘మూడేళ్ల క్రితం 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన చేదు అనుభవం ఎప్పుడో మరిచిపోయాం. ఇప్పుడు తాజాగా ఈ టోర్నీని ఆరంభిస్తాం. మా శక్తిమేర మేం రాణిస్తాం. ఒకవేళ టి20 కప్‌ గెలిస్తే అదే పెద్ద బహుమతి అవుతుంది. ఏదేమైనా ఒత్తిడి లేకుండా ఆడేందుకే ప్రయత్నిస్తాం. సహచరుల్లో కొందరికి ఇక్కడ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడిన అనుభవం ఉంది. అది ఇప్పుడు అక్కరకొస్తుంది. మేం కప్‌ కొడితే మాత్రం ఎన్నో మారిపోతాయి. ఒకవేళ మహిళల ఐపీఎల్‌ అంటూ పెడితే మాకెంతో మేలు జరుగుతుంది’ అని వరుసగా ఏడో టి20 ప్రపంచకప్‌లో ఆడనున్న హర్మన్‌ తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top