‘అర్జున’ రేసులో రాహుల్‌

Weightlifting Federation Nominated Andhra Pradesh Player Venkat Rahul - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ పేరును కేంద్రానికి నామినేట్‌ చేసిన వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట్‌ రాహుల్‌ పేరును ఈ ఏడాది కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కోసం భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌) నామినేట్‌ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్‌ 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అంతకుముందు 2015, 2017లలో కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 2015 ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రాహుల్‌... 2014 యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో రజతం... 2013 ఆసియా యూత్‌ క్రీడల్లో స్వర్ణం... 2013 ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

మీరాబాయి, పూనమ్‌ పేర్లను కూడా...
రాహుల్‌తోపాటు మీరాబాయి చాను (మణిపూర్‌), పూనమ్‌ యాదవ్‌ (ఉత్తరప్రదేశ్‌) పేర్లను ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌ కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. అయితే మీరాబాయి ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకుంది. వాస్తవానికి ‘ఖేల్‌రత్న’ కోసం ఎవరినైనా నామినేట్‌ చేయాలంటే ముందుగానే వారికి ‘అర్జున’ వచ్చి ఉండాలి. కానీ 2017లో మీరాబాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా నిలువడంతో ఆమె ఘనతకు గుర్తింపుగా కేంద్ర క్రీడాశాఖ నేరుగా ‘ఖేల్‌రత్న’ను అందజేసింది. ఇప్పటికే తాను అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నా ‘అర్జున’ అవార్డు ప్రత్యేకత వేరుగా ఉంటుందని మీరాబాయి వ్యాఖ్యానించింది. పూనమ్‌ యాదవ్‌ 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2015లో సతీశ్‌ శివలింగం అర్జున అవార్డు పొందాక మరే వెయిట్‌లిఫ్టర్‌కు ‘అర్జున’ లభించలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top