వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ.. ఆపై నయా రికార్డు

 Warner Breaks Azhar Ali's Highest Score Record In Pink Ball Test - Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన వార్నర్‌..  పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో భారీ సెంచరీతో మెరిశాడు. అదే జోరును రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సైతం కొనసాగిస్తున్నాడు. నిన్నటి తొలి రోజు ఆటలో సెంచరీ మార్కును చేరిన వార్నర్‌.. ఈ రోజు ఆటలో దాన్ని ట్రిపుల్‌ సెంచరీగా మలచుకున్నాడు. 394 బంతుల్లో 37 ఫోర్లతో వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ కాగా, ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు. ఇక పాకిస్తాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా గుర్తింపు సాధించిన వార్నర్‌.. ఓపెనర్‌గా నాల్గో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్‌.

కాగా, డే అండ్‌ నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన నయా రికార్డును వార్నర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు వరకూ పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ(302 నాటౌట్‌) పేరిట ఈ రికార్డు ఉండగా దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.వార్నర్‌ 303 పరుగులకు చేరిన తర్వాత అజహర్‌ అలీ రికార్డు బ్రేక్‌ అయ్యింది.డే అండ్‌ నైట్‌ టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల సాధించిన రికార్డును కూడా వార్నర్‌ సాధించాడు. డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో అజహర్‌ అలీ మొత్తంగా 456 పరుగులు చేస్తే దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును కూడా వార్నర్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును బ్రేక్‌ చేశాడు. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన పుణె టెస్టులో కోహ్లి అజేయంగా 254 వ్యక్తిగత పరుగులు సాధించగా, దాన్ని వార్నర్‌ సవరించాడు.

302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా లబూషేన్‌(162) వికెట్‌ను కోల్పోయింది. లబూషేన్‌ భారీ సెంచరీ చేసిన తర్వాత రెండో వికెట్‌గా కోల్పోయాడు.  కాగా, డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తొలి రోజు దూకుడునే కొనసాగించాడు. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌.. రెండో రోజు ఆటలో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. 166 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వార్నర్‌ సమయోచితంగా ఆడి ద్విశతకం నమోదు చేశాడు. ఆపై ట్రిపుల్‌ సెంచరీని సాధించాడు. స్టీవ్‌ స్మిత్‌(36) మూడో వికెట్‌గా ఔటైనప్పటికీ వార్నర్‌ మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. డబుల్‌ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుని ఆసీస్‌కు భారీ స్కోరును సాధించిపెట్టాడు. లబూషేన్‌తో కలిసి వార్నర్‌ 361 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఆ సమయానికి వార్నర్‌ 418 బంతులాడి 39 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 335 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top