
న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్ అంటే విధ్వంసకర బ్యాటింగ్ కు నిర్వచనం. తన క్రికెట్ కెరీర్‌లో ఏ స్థాయి బౌలర్ తారసపడినా చితక్కొట్టడమే సెహ్వాగ్ శైలి. చాలా సమయాల్లో ఫోర్‌తోనో, సిక్స్‌తోనో ఇన్నింగ్స్ మొదలుపెట్టేవాడు వీరేంద్ర సెహ్వాగ్. అదే ఆటను సెంచరీ దగ్గర కూడా కొనసాగించేవాడు. ప్రత్యర్థి బౌలర్ నుంచి వేగంగా వచ్చిన బంతిని సిక్స్ గా మలచి సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి అటువంటి ఆటగాడ్ని భయపెట్టింది మాత్రం ఒకే ఒక్క బౌలర్ అట. అతను పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అని ఒక డాట్ కామ్ నిర్వహించిన లైవ్ చాట్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఈ షోలో షాహిద్ ఆఫ్రిదితో కలిసి తన అనుభవాల్ని పంచుకున్న సెహ్వాగ్.. అసలు షోయబ్ అక్తర్ నుంచి ఏ విధమైన బంతులు వస్తాయో ఊహించడం కష్టమయ్యేదన్నాడు. ఒక బంతిని కాళ్ల మధ్య వేస్తే, మరొక బంతిని తన తలపైకి వేసేవాడన్నాడు. అతను వేసే బౌన్సర్లను హిట్ చేసే క్రమంలో ఎక్కువగా భయపడేవాడినని సెహ్వాగ్ తెలిపాడు. అదే సమయంలో 2007, 2011ల్లో వరల్డ్ కప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉండటం తన క్రికెట్ కెరీర్‌లో ఫేవరెట్ మూమెంట్స్ గా పేర్కొన్నాడు.
మరొకవైపు ఆఫ్రిది సైతం తనను ఎక్కువ భయపెట్టిన బ్యాట్స్‌మన్ ఎవరైనా ఉన్నారంటే అది సెహ్వాగేనని పేర్కొన్నాడు. తాను ఎవరికి బౌలింగ్ చేసినా భయపడేవాడిని కాదని, ఒక్క సెహ్వాగ్‌కు బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం తెలియని భయం చుట్టేముట్టేదన్నాడు. ఇక తనకు చిరస్మరణీయమైన మూమెంట్ ఏదైనా ఉందంటే అది 2009లో పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్‌ను గెలవడమేనన్నాడు.