
విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీకి అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. తనదైన బ్యాటింగ్ శైలితో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోహ్లి అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తనతో సెల్ఫీ దిగాలనుకునేవారిని ఢిల్లీకి రమ్ముంటున్నాడు కోహ్లి. విషయం ఏమిటంటే.. కొద్ది రోజుల క్రితం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని మ్యూజియంలో పెట్టేందుకు కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మ్యూజియంలో పెట్టేందుకు కోహ్లి విగ్రహం సిద్ధమైందట. రేపు (బుధవారం) ఆ మ్యూజియంలో కోహ్లి మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కోహ్లినే స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
‘నాతో సెల్ఫీలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి. జూన్ 6 నుంచి నేను మీకు అక్కడ అందుబాటులో ఉంటాను. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే అభిమానులు మాత్రం తమకు కోహ్లితోనే సెల్ఫీలు కావాలని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మ్యూజియంలో టీమిండియా దిగ్గజాలు కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌లతో ఫుట్ బాల్ దిగ్గజాలు మెస్సీ, డెవిడ్ బెక్కమ్‌ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి.
Come 6th of June, let’s play statue! 😉 Excited to be at #MadameTussauds 😃#TussaudsDelhi@MadameTussauds@tussaudsdelhi pic.twitter.com/074c3lQF0o
— Virat Kohli (@imVkohli) 5 June 2018