గెలిపించిన అక్షత్, సిరాజ్‌

Vijay Hazare Trophy Group Indies ODI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ గ్రూప్‌ ‘డి’లో హైదరాబాద్‌ శుభారంభం చేసింది. సోమవారం సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 128 పరుగుల భారీ తేడాతో సర్వీసెస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. కెప్టెన్‌ అక్షత్‌ రెడ్డి (116 బంతుల్లో 127; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి సెంచరీ సాధించగా, కొల్లా సుమంత్‌ (26 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరికి ఆకాశ్‌ భండారి (37 బంతుల్లో 47; 4 ఫోర్లు, ఒక సిక్స్‌), రోహిత్‌ రాయుడు (37; 2 ఫోర్లు), బావనక సందీప్‌ (36; 3 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం సర్వీసెస్‌ 40.4 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (92 బంతుల్లో 64; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, హార్దిక్‌ సేథి (38), సూరజ్‌ యాదవ్‌ (34) ఫర్వాలేదనిపించారు. మొహమ్మద్‌ సిరాజ్‌ 45 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రోహిత్, భండారిలకు చెరో 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌తో ముగ్గురు హైదరాబాద్‌ తరఫున, ఐదుగురు సర్వీసెస్‌ తరఫున లిస్ట్‌–ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో సౌరాష్ట్ర 32 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై... విదర్భ ఏడు పరుగులతో జార్ఖండ్‌పై గెలుపొందాయి.  

రాణించిన సుమంత్‌: ఆంధ్ర విజయం
చెన్నై: ఆంధ్ర జట్టు మొదటి మ్యాచ్‌లో చెలరేగి టోర్నీని విజయవంతంగా ప్రారంభించింది. గ్రూప్‌ ‘సి’లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్లతో రాజస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా రాజస్తాన్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. చేతన్‌ (82 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, అయ్యప్పకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆంధ్ర 45 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసి గెలిచింది. బోడపాటి సుమంత్‌ (52 బంతుల్లో 71 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేయగా, విహారి (49; 4 ఫోర్లు),  భరత్‌ (38; 3 ఫోర్లు), అశ్విన్‌ హెబర్‌ (27 బంతుల్లో 33; 8 ఫోర్లు) రాణించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top