
లక్ష్యం...‘హ్యాట్రిక్’
ఓవైపు కరీబియన్ గడ్డపై వరుసగా మూడో సిరీస్ గెలవాలన్న లక్ష్యం... మరోవైపు కొత్త కోచ్ అనిల్ కుంబ్లే బాధ్యతలు...
నేటి నుంచి భారత్, విండీస్‌ల తొలి టెస్టు
జోరుమీదున్న కోహ్లిసేన
అనుభవలేమితో కరీబియన్లు
అంటిగ్వా: ఓవైపు కరీబియన్ గడ్డపై వరుసగా మూడో సిరీస్ గెలవాలన్న లక్ష్యం... మరోవైపు కొత్త కోచ్ అనిల్ కుంబ్లే బాధ్యతలు... ఈ నేపథ్యంలో భారత్ జట్టు వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచి (గురువారం) ఇక్కడ జరిగే తొలి టెస్టులో ఆతిథ్య జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు డ్రాగా ముగించినా.. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
కోహ్లికి కూడా హ్యాట్రిక్
గతేడాది శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచిన కోహ్లి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం చూస్తున్నాడు. అలాగే కరీబియన్ గడ్డపై కూడా మూడో సిరీస్ విజయాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. 2006లో ద్రవిడ్, 2011లో ధోనిల కెప్టెన్సీలో విండీస్ గడ్డపై భారత్ సిరీస్ గెలిచింది. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పట్నించీ ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని పక్కగా అమలు చేస్తున్న విరాట్.. ఈ మ్యాచ్‌లోనూ దీన్ని కొనసాగించే అవకాశాలున్నాయి. ఓపెనింగ్‌లో ధావన్, విజయ్‌లను కొనసాగించి వన్‌డౌన్‌లో పుజారా స్థానాన్ని రాహుల్‌తో భర్తీ చేస్తే ఎలా ఉంటుందని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లకు బౌన్సీ వికెట్లను రూపొందించిన విండీస్.. రాబోయే నాలుగు టెస్టులకు ఇదే అనవాయితీని కొనసాగించనుంది. అయితే పిచ్‌లపై పచ్చిక ఉన్నా వాటి స్వభావం (స్లో)లో పెద్దగా మార్పు ఉండదని సహాయక సిబ్బంది ఆలోచన. దీంతో ముగ్గురు స్పిన్నర్లు (అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా) లను కూడా ఆడించే అవకాశం ఉంది.
ఇద్దరే అనుభవజ్ఞులు
మరోవైపు విండీస్ జట్టులో చాలా మందికి అనుభవం లేదు. కేవలం సీనియర్ ఆటగాళ్లు బ్రేవో, శామ్యూల్స్‌లకు 50కిపైగా టెస్టులు ఆడిన అనుభవం ఉంది. దీంతో ఈ ఇద్దరిపైనే కెప్టెన్ హోల్డర్ నమ్మకం పెట్టుకున్నాడు. భారత్‌తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న బ్లాక్‌వుడ్, రాజేంద్రలు సత్తా చాటితే భారీ స్కోరు వస్తుంది.
మూడు గంటల్లో ముగిసిపోయే పొట్టి ఫార్మాట్ నుంచి ఐదు రోజుల టెస్టు క్రికెట్‌పైకి ఆటగాళ్ల ఆలోచనలు మార్చేందుకు దృష్టిపెట్టాం. టెస్టులో బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజులో గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ సిరీస్‌లో స్పిన్నర్లు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. - అనిల్ కుంబ్లే (భారత కోచ్)
రా. గం. 7.30 నుంచి టెన్-2లో ప్రత్యక్ష ప్రసారం