కొట్టర కొట్టు... సిరీస్‌ పట్టు

Today India and South Africa are the second T20 - Sakshi

నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో టి20

గెలిస్తే పొట్టి ఫార్మాట్‌ కూడా మనదే

పర్యాటక జట్టుది సంపూర్ణ ఆధిపత్యం... ఆతిథ్య జట్టుది ఆపసోపాల పయనం!
ఇటువైపు దుర్భేద్యమైన సేన... అటువైపు అనుభవం లేని బలగం!
ఒకరిది సిరీస్‌ గెలవాలన్న ఆరాటం... మరొకరిది పరువు నిలబెట్టుకోవాలనే పోరాటం! 
ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.  

సెంచూరియన్‌: ఈ పర్యటనలో సెంచూరియన్‌లో ఆడిన రెండు వన్డేల్లో ఘనవిజయాలు సాధించిన భారత్‌కు అదే వేదికపై టి20 సిరీస్‌నూ ఒడిసిపట్టేందుకు మంచి అవకాశం. కలిసొచ్చిన మైదానం, అద్భుత ఫామ్, బలహీనపడిన ప్రత్యర్థి ఇన్ని అనుకూలతల మధ్య పొట్టి ఫార్మాట్‌నూ చేజిక్కించుకునే అరుదైన సందర్భం. మ్యాచ్‌మ్యాచ్‌కు బలీయంగా మారుతున్న కోహ్లి సేన... సఫారీలను అంతకంతకూ కిందకునెడుతోంది. ఆడేది సొంతగడ్డపై అయినా, అసాధారణ ప్రతిఘటన చూపితే తప్ప ప్రొటీస్‌కు విజయం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే రెండో టి20 లోనూ మన జట్టే ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. 

విరాట్, కుల్దీప్‌ ఆడతారు... 
వరుస విజయాల ఊపులో విదేశాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి సానుకూల దృక్పథంతో ఉంది ప్రస్తుత భారత జట్టు. అన్ని రంగాల్లో సమతూకంతో... ఓటమి అనే ఆలోచనే దరిదాపుల్లో లేనట్లుగా ఆడుతోంది. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే ఇలాంటి స్థితిలో సిరీస్‌ విజయం ఖాయం చేసే రెండో టి20 బరిలో దిగనుంది. తొలి మ్యాచ్‌లో తుంటి గాయంతో ఇబ్బంది పడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వేలి గాయంతో దూరమైన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సెంచూరియన్‌లో ఆడటం ఖాయమైంది. పిచ్‌ పరిస్థితులరీత్యా చూసినా కుల్దీప్‌ తుది జట్టులో ఉండే అవకాశమే ఎక్కువ. దీంతో పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ తప్పుకోవాల్సి వస్తుంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అద్భుత ఫామ్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తోడైతే శుభారంభం దక్కుతుంది. పునరాగమనంలో ఆశ్చర్యకరంగా మూడో స్థానంలో వచ్చిన సురేశ్‌ రైనాను మళ్లీ అక్కడే ఆడిస్తారా అనేది ఆసక్తికరం. లేదంటే కోహ్లి తనకిష్టమైన వన్‌డౌన్‌లో దిగుతాడు. కావాల్సినన్ని బంతులున్నా జొహన్నెస్‌బర్గ్‌లో వేగంగా ఆడలేకపోయిన మనీశ్‌ పాండేకు మరో అవకాశం దక్కొచ్చు. ధోనితో పాటు హార్దిక్‌ పాండ్యా రాణిస్తే జట్టు స్కోరు మరింత పైకెళ్తుంది. పేసర్లు భువనేశ్వర్, బుమ్రాల నిలకడకు లెగ్‌స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మాయాజాలం కలిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలే. మొదట బ్యాటింగ్‌కు దిగితే ఈసారీ భారీ స్కోరు చేసి కఠిన సవాల్‌ విసరాలి. ఏదైనా ఇబ్బందని భావించి చివరి నిమిషంలో కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటే మాత్రం లోకేశ్‌ రాహుల్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. అయితే ఇందుకు అవకాశం తక్కువని తెలుస్తోంది.  

సఫారీలు ఈసారైనా నిలుస్తారా? 
కెప్టెన్‌ డుమిని, హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్, ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ మినహా... పెద్దగా అనుభవం లేనివారితో ఆడుతున్న దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్‌ చావోరేవో. గెలిస్తే సిరీస్‌ను మూడో మ్యాచ్‌ వరకైనా పొడిగించారని పేరు దక్కుతుంది. ఓడితే మాత్రం చివరి మ్యాచ్‌లో చేసేదేమీ ఉండదు. అన్నిటికిమించి రెండో, ఆరో వన్డేల్లో దారుణంగా ఓడిన సెంచూరియన్‌ వేదికలో ఆడాల్సి ఉండటమే ప్రత్యర్థి కంటే వారిని ఎక్కువగా భయపెడుతుండవచ్చు. ప్రత్యేక సన్నద్ధత ఏదైనా ఉంటేనే ఇక్కడి నెమ్మదైన పిచ్‌పై టీమిండియా మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కోగలరు. దీంతోపాటు భువీ, బుమ్రాల బౌలింగ్‌ను ఆడటమూ వారికి భారంగా మారుతోంది. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్, బెహర్దీన్‌ తప్ప ఎవరూ నిలవలేదు. బౌలింగ్‌లో షమ్సీ ఒక్కడే భారత ఆటగాళ్లను కొంత ఇబ్బంది పెట్డాడు. జూనియర్‌ డాలా రెండు వికెట్లు తీసినా పరుగులు భారీగా ఇచ్చాడు. ఫీల్డింగ్‌లోనూ జట్టు ప్రమాణాలు మెరుగు పడాల్సి ఉంది. ఏదేమైనా బ్యాటింగ్‌లో ఒకట్రెండు ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు, బౌలింగ్‌లో అనూహ్య ప్రదర్శనలు తోడైతేనే విజయం గురించి ఆలోచించేందుకు వీలుంటుంది. 

జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రైనా, మనీశ్‌ పాండే/దినేశ్‌ కార్తీక్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, ఉనాద్కట్‌/కుల్దీప్, చహల్, బుమ్రా.  

దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్‌), హెన్‌డ్రిక్స్, స్మట్స్, మిల్లర్, బెహర్దీన్, క్లాసెన్, మోరిస్, ఫెలుక్‌వాయో, జూనియర్‌ డాలా, డేన్‌ ప్యాటర్సన్, షమ్సీ/ఫాంగిసో. 

పిచ్, వాతావరణం 
గతంలో సెంచూరియన్‌ వేదికగా జరిగిన ఆరు టి20 మ్యాచ్‌ల్లో ఐదుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టునే విజయం వరించింది. ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు స్కోరు 186. ఈసారి కూడా బ్యాటింగ్‌ పిచ్‌ ఉండే అవకాశముంది. బుధవారం ఉదయం వర్షం కురుస్తుందని... సాయంత్రం, రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతంగా ఉండొచ్చని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.  

►మరో 18 పరుగులు చేస్తే టి20ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలుస్తాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు గప్టిల్‌ (2,250), బ్రెండన్‌ మెకల్లమ్‌ (2,140) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  

► ఈ వేదికపై దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్‌లు  ఆడి మూడు గెలిచి, మూడు  ఓడిపోయింది. భారత్‌ మాత్రం  ఈ మైదానంలో తొలిసారి టి20  మ్యాచ్‌ ఆడనుంది.   

► రాత్రి గం. 9.30 నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top