ఓటమితో ఆరంభం | Sakshi
Sakshi News home page

ఓటమితో ఆరంభం

Published Tue, Mar 25 2014 1:20 AM

ఓటమితో ఆరంభం

 సిల్హెట్: టి20 ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండు విజయాలతో దూసుకుపోతోంది. అయితే మరోవైపు మహిళల జట్టు మాత్రం టోర్నీని పరాజయంతో ప్రారంభించింది. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో భారత్ 22 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేయగా, భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ప్రబోధినికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్, పటిష్టమైన ఇంగ్లండ్‌తో తలపడుతుంది.


 రాణించిన జయాంగని...

 లంక స్కోరులో ఓపెనర్ అటపట్టు జయాంగని (44 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక పాత్ర పోషించింది. మూడో వికెట్‌కు  కెప్టెన్ సిరివర్ధనే (5)తో 29 పరుగులు, నాలుగో వికెట్‌కు కౌశల్య (29 బంతుల్లో 34; 4 ఫోర్లు)తో కలిసి 31 పరుగులు జోడించడంతో లంక గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టింది.
 

సమష్టి వైఫల్యం...

 ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ మిథాలీ రాజ్ (23 బంతుల్లో 16; 2 ఫోర్లు) కొద్దిసేపు నిలబడినా...ఇతర ప్లేయర్లు అంతా విఫలమయ్యారు. శిఖా పాండే (19 బంతుల్లో 22; 2 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 17; 1 ఫోర్) పోరాడినా లాభం లేకపోయింది. లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించగలిగారు. ప్రబోధిని, సముద్దిక, ఇనోక తలా 2 వికెట్లు తీశారు.
 

Advertisement
Advertisement