
మహిళా శక్తి
పనిప్రదేశాల్లో అంటే ఆఫీసులు మొదలు అసంఘటిత రంగాల వరకు ఎక్కడైనా ఎంత ఎక్కువమంది మహిళలుంటే జెండర్ సెన్సిటివిటీకి అంత ఎక్కువ అవకాశం ఉంటుందని చెబుతుంటారు సామాజిక కార్యకర్తలు. ఆ ప్రయత్నం పట్టాలెక్కిందనిపిస్తోంది వడోదర ఎల్ అండ్ టీ ఫ్యాక్టరీలోని ఆల్ విమెన్ ఇంజినీర్స్ టీమ్‌ను చూస్తుంటే! ఆ మహిళా జట్టు మన తొలి బులెట్ ట్రైన్ (MAHSR... ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్) ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమవుతూ కొత్త చరిత్రకు ట్రాక్ వేస్తోంది. నిర్మాణం నుంచి నిర్వహణ దాకా సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తున్నారు. ఆ టీమ్‌లో తెలుగు అమ్మాయీ ఉండటం తెలుగురాష్ట్రాలకు గర్వకారణం.
హైదరాబాద్‌కు చెందిన రంగు స్రవంతి, తమిళనాడు, కోయంబత్తూర్‌కు చెందిన ఆదిత్య ఆర్, కేరళ, కొత్తమంగళానికి చెందిన సుమయ్యా, అదే రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన ఫిదా రషీద్‌లతో కూడిన ఓ పదిమంది అమ్మాయిల టీమ్ ఎమ్మేహెచ్చెస్సార్ ప్రాజెక్ట్‌లో ప్లానింగ్ నుంచి క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్, డిస్పాచ్ వరకు అన్ని శాఖల్లో కీలకమైన విధుల్లో ఉన్నారు.
ఈ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయినవారే! ట్రైనీలుగా చేరి ఇప్పుడు సీనియర్ ఇంజినీర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నిర్మాణరంగంలో 20 శాతం కూడా మహిళలులేని చోట వీరు నెలకు తొమ్మిదివేల ప్రీకాస్ట్ నాయిస్ బారియర్స్ (శబ్ద కాలుష్యాన్ని తగ్గించే పానల్స్)ను తయారుచేస్తూ పురుషులకు దీటుగా తమ శక్తిని చాటుకుంటున్నారు.
2023లో...
ఈ యువ ఇంజినీర్ల హైస్పీడ్ రైల్ జర్నీ 2023లో మొదలైంది. వాళ్లలో ఏ ఒక్కరూ అనుకోలేదట తామీ ప్రాజెక్ట్‌లో భాగమవుతామని. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నప్పుడు ఇలా రికార్డ్ క్రియేట్ చేసే కొలువుల్లో చేరుతామన్న ఊహ కూడా లేదు ఎవరికీ! ఎల్ అండ్ టీకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్‌లో తమకు ప్లేస్‌మెంట్ ఖాయమయిందని తెలియగానే అందరూ చాలా ఉత్సాహపడ్డారు. అదే ఉత్సాహంతో శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరారు. తొలిరోజు సైట్‌లోకి అడుగుపెట్టగానే ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా అనిపించింది.
పనీ అంతే కష్టంగా తోచింది. పురుష ఉద్యోగుల నుంచి ఏమాత్రం సహకారం అందక పోగా ‘ఏంటీ.. ఈ ఫీల్డ్‌లో కూడా ప్రతాపం చూపించుకోవాలనే..!’ అన్నట్టుగా ఉండేవట వాళ్ల చూపులు, మాటలు. అయినా నిరుత్సాహపడలేదు.. నేర్చుకోవాలనే తపనను వీడలేదు. పట్టుదలతో పని నేర్చుకున్నారు. హేళన చేసిన పురుష ఉద్యోగులు ఆశ్చర్య పోయారు. గౌరవించడం మొదలుపెట్టారు. పని నేర్చుకోవడంలో సాయపడ్డారు. ‘అప్పటిదాకా ఆడవాళ్లు ఇలా సైట్‌లోకొచ్చి పనిచేయడం వాళ్లు చూడలేదు. అందుకే మేము రావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కానీ పని పట్ల మాకున్న కమిట్‌మెంట్ చూసి మమ్మల్ని గౌరవించడం మొదలుపెట్టారు.
దాంతో ఆఫీసులో పని చేసే వాతావరణమే మారి పోయింది’ అని చెబుతుంది డిస్పాచ్ ఇన్‌చార్జ్ ఫిదా రషీదా. ‘మొదటి అవకాశమే ఇందులో రావడం.. ఆల్ విమెన్ టీమ్‌లో భాగమవడం.. నిజంగా ప్రౌడ్ మూమెంట్స్’ అంటుంది క్వాలిటీ ఇన్‌చార్జ్ సుమయ్యా. ‘అత్యాధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో నేను పాలు పంచు కుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని చెబుతుంది ప్రొడక్షన్ ఇన్‌చార్జ్ రంగు స్రవంతి. ‘నిర్మాణ రంగంలోకి మరింతమంది అమ్మాయిలు రావాలి. అప్పుడే ఇందులోనూ మహిళా భాగస్వామ్యం పెరిగి కీలక బాధ్యతల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది’ అంటుంది ప్లానింగ్ ఇన్‌చార్జ్ అదితి. వీళ్లంతా కష్టపడుతున్న ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం మూడుగంటల్లో చేరుకోవచ్చు.