
దేశంలో మొట్టమొదటి హైస్పీడ్ బుల్లెట్ రైలు
‘ఈ–10’ షింకన్సెన్ రైళ్లు పంపనున్న జపాన్
ముంబై–సబర్మతి మధ్య 2030లో పరుగు
ప్రాజెక్టు వ్యయం రూ.1,08,000 కోట్లు
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. గుజరాత్‌లోని స్టేషన్ ్సలో సివిల్ పనులు పూర్తి అయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేస్తున్న ‘ఈ–10’ షింకన్సెన్ బుల్లెట్ రైలు 2030లో పట్టాలెక్కనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం ఈ ట్రైన్ ప్రత్యేకత.
జపాన్ పర్యటనలో భాగంగా షింకన్సెన్ బుల్లెట్ రైలులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ సహకారంతో ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హై స్పీడ్ రైల్ నడపడం కోసం అక్కడ శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతోనూ మోదీ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో దేశంలోని తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది.
508 కి.మీ. కారిడార్
బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీల గుండా పోతుంది. మొత్తం కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. వీటిలో మహారాష్ట్రలో నాలుగు, గుజరాత్‌లో ఎనిమిది రానున్నాయి. మహారాష్ట్రలో ముంబై స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, అలాగే గుజరాత్‌లోని వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్ ్స రానున్నాయి.
⇒ మొత్తం 8 స్టేషన్లలో ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి.
⇒ 395 కి.మీ పీయర్ పనులు, 407 కి.మీ. ఫౌండేషన్, 337 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి.
⇒ 17 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మరో 9 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికావచ్చింది.
⇒ 317 కి.మీ. వయడక్ట్ నిర్మాణం కూడా పూర్తయింది.
⇒ గుజరాత్‌లో 198 కిలోమీటర్ల ట్రాక్ సిద్ధమైంది.
ట్రయల్ రన్ 2027లో..
గుజరాత్‌లో మొదటి 50 కిలోమీటర్ల మార్గంలో 2027లో బుల్లెట్ రైలు పరుగు తీయనుంది. గుజరాత్‌లోని స్టేషన్ల నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి, మొత్తం ప్రాజెక్టు 2029 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.
రూ.78,839 కోట్ల వ్యయం
ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.78,839 కోట్లు ఖర్చు చేశారు.
⇒ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 81 శాతం మొత్తాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్ ప్రభుత్వం సమకూరుస్తోంది.
⇒ ఈ ప్రాజెక్టులో రైల్వే శాఖకు 50 శాతం; మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు చెరి 25 శాతం వాటా ఉంది. ఆర్థిక సహాయంతోపాటు భారత్‌లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సన్ రైళ్లను జికా ఉచితంగా సరఫరా చేస్తోంది.
స్థల సేకరణ పూర్తి
మహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం, కోవిడ్–19 మహమ్మారి.. తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం అయింది. ప్రాజెక్టుకు కావాల్సిన 1,389.5 హెక్టార్ల భూ సేకరణ పూర్తి అయినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని అనుమతులూ పొంది, సివిల్ కాంట్రాక్టులన్నీ నిర్మాణ సంస్థలకు అప్పగించారు.

80 నిమిషాల్లో...
గంటకు 400 కి.మీ. వేగంతో పరిగెత్తే ఈ–10 బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి సబర్మతికి మధ్య ఉన్న 508 కిలోమీటర్ల దూరాన్ని నాన్ –స్టాప్‌గా అయితే 80 నిముషాల్లో పూర్తి చేస్తుంది.
ఈ–5 కాదు.. ఈ–10 రైళ్లు
ఒప్పందంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ‘ఈ–5’ షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మనదేశానికి పంపాలి. కానీ, ఇప్పుడు అత్యాధునికమైన ‘ఈ–10’ రైళ్లు ఆ దేశం తయారుచేస్తోంది. వాటినే మనకు పంపనుంది. ఇవి జపాన్ తోపాటు భారత్‌లోనూ 2030 ప్రారంభంలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ‘ఈ–5’ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు గరిష్టంగా 320 కి.మీ. కాగా, ఈ–10 రైలు వేగం 400 కి.మీ. ఈ రైళ్లను భారత్‌లోనూ తయారు చేసే అవకాశం ఉంది.
సముద్రగర్భ రైల్ టన్నెల్
ఈ కారిడార్‌లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముంబై–థానే మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్‌లో భారత్‌లో మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్‌లు ఉంటాయి. మహారాష్ట్రలోని 4 కి.మీ. టన్నెల్ పనులు, గుజరాత్‌లోని ఒకే ఒక్క టన్నెల్ నిర్మాణం పూర్తయ్యాయి.
⇒ హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 508 కి.మీ.
⇒ నర్మద, తపతి వంటి నదులపై నిర్మిస్తున్న మొత్తం 25 రివర్ బ్రిడ్జిలలో 17 పూర్తి
⇒ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,08,000 కోట్లలో ఇప్పటికే రూ.78,839 కోట్ల వ్యయం
⇒ గుజరాత్‌లో 2027లో 50 కిలోమీటర్లలో పాక్షిక కార్యకలాపాలు
⇒ 2030లో పూర్తిస్థాయిలో పరుగులు తీయనున్న బుల్లెట్ రైల్