కల్మాడీ, చౌతాలా నియామకం రద్దు | Suresh Kalmadi: IOA cancels Suresh Kalmadi and Abhay Chautala | Sakshi
Sakshi News home page

కల్మాడీ, చౌతాలా నియామకం రద్దు

Jan 11 2017 1:40 AM | Updated on Sep 22 2018 8:25 PM

కల్మాడీ, చౌతాలా నియామకం రద్దు - Sakshi

కల్మాడీ, చౌతాలా నియామకం రద్దు

తమ జీవిత కాల గౌరవ అధ్యక్షులుగా సురేశ్‌ కల్మాడీ, అభయ్‌ సింగ్‌ చౌతాలా నియామకాలపై భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) దిద్దుబాటు చర్యలకు దిగింది

వెనక్కి తగ్గిన ఐఓఏ
క్రీడా మంత్రిత్వ శాఖ హర్షం
నిషేధం ఎత్తివేత  


న్యూఢిల్లీ: తమ జీవిత కాల గౌరవ అధ్యక్షులుగా సురేశ్‌ కల్మాడీ, అభయ్‌ సింగ్‌ చౌతాలా నియామకాలపై భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) దిద్దుబాటు చర్యలకు దిగింది. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వీరిద్దరి ఎంపికపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీరియస్‌ అయిన కేంద్ర క్రీడా శాఖ ఐఓఏకు షోకాజ్‌ నోటీసుతో పాటు నిషేధం కూడా విధించింది. దీంతో దారిలోకొచ్చిన ఐఓఏ... కల్మాడీ, చౌతాలా నియామకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘గత నెల 12న చెన్నైలో జరిగిన వార్షిక సమావేశం చివర్లో ఓ సభ్యుడు ఐఓఏ ఇద్దరు జీవితకాల అధ్యక్షులను నామినేట్‌ చేయాలని సూచించారు. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్మానం చేయలేదు.

ఓటింగ్‌ కూడా జరగలేదు. ఐఓఏ నియమావళి ప్రకారం సభ్యులు తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా జరగలేదు. సాంకేతికపరంగా అది చెల్లుబాటు కాదు. అయితే ఈ విషయం మొత్తంలో గందరగోళం జరిగి ఐఓఏకు, సభ్యులకు అసౌకర్యం కలిగించింది. ఇందుకు పశ్చాత్తాపపడుతున్నాను’ అని క్రీడా శాఖ జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు స్పందిస్తూ రాసిన లేఖలో ఐఓఏ అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రన్‌ పేర్కొన్నారు. ఐఓఏను దశాబ్దాలపాటు తన ఆధిపత్యంలో ఉంచుకున్న కల్మాడీ 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ అవినీతి కుంభకోణంలో నిందితుడిగా తొమ్మిది నెలల జైలు జీవితం గడిపారు. అలాగే హరియాణాలో చౌతాలా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. కళంకితులకు దూరంగా  ఉండాలనే తమ నియమావళికి వ్యతిరేకంగా వీరిద్దరిని గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు ఐఓఏ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది.

స్వాగతించిన క్రీడా శాఖ...
ఐఓఏ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీంతో వెంటనే తాము విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ‘ఐఓఏ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. కల్మాడీ, చౌతాలా ఎంపికపై వెనక్కి తగ్గే వరకు తమ నిషేధం కొనసాగుతుందని ఇంతకుముందే ప్రకటించాం. ఇప్పుడు అదే జరిగింది కాబట్టి నిషేధం తొలగినట్టే’ అని క్రీడా శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement