
తిరుగులేని ‘నరైన్’ మంత్రం
ఐపీఎల్-7 తొలి మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్ చూస్తే అతని సత్తా ఏమిటో మరోసారి అర్థమవుతుంది. మూడో బంతికే హస్సీని అవుట్ చేసిన అతను కీలక సమయంలో రాయుడు వికెట్ తీసి తన జట్టును నిలబెట్టాడు.
బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేస్తున్న స్పిన్నర్
టి20ల్లో సవాల్‌గా సునీల్ బౌలింగ్
ఇప్పటికీ ఎదుర్కోలేకపోతున్న ప్రత్యర్థులు
సాక్షి క్రీడా విభాగం
ఐపీఎల్-7 తొలి మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్ చూస్తే అతని సత్తా ఏమిటో మరోసారి అర్థమవుతుంది. మూడో బంతికే హస్సీని అవుట్ చేసిన అతను కీలక సమయంలో రాయుడు వికెట్ తీసి తన జట్టును నిలబెట్టాడు. అదే జోరులో చివరి ఓవర్లో మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ నాలుగు వికెట్లలో మూడు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టి దాదాపు రెండున్నరేళ్లు పూర్తయినా... ఐపీఎల్‌లో గత మూడు సీజన్లుగా ఆడుతున్నా ఇప్పటికీ అతని స్పిన్‌ను చదవడం బ్యాట్స్‌మెన్‌కు ‘మిస్టరీ’గానే మారిపోయింది. ఎవరైనా కొత్త బౌలర్‌తో ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డా... ఆ తర్వాత కొన్నాళ్లకే సదరు బౌలర్‌ను చితక్కొట్టడం మనకు కనిపిస్తుంది. అజంతా మెండిస్ ఇందుకు చక్కటి ఉదాహరణ. కానీ నరైన్ విషయంలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా టి20 మ్యాచ్‌ల్లో అనితర సాధ్యమైన గణాంకాలు అతను నమోదు చేస్తున్నాడు.
లీగ్‌ల హీరో...
సునీల్ నరైన్ ఐపీఎల్ సహా ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు (కరీబియన్, దక్షిణాఫ్రికా, సీఎల్ టి20 తదితర) లీగ్‌లలో ఆడుతున్నాడు. ఒక్క బిగ్‌బాష్ మినహా అన్నింటిలో అతను అతి తక్కువ సగటుతో వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఈ టోర్నీల్లో నరైన్ ఎకానమీ రేట్ ఎప్పుడూ 6 దాటకపోవడం విశేషం. టి20ల్లో సాగే విధ్వంసకర బ్యాటింగ్‌తో పోలిస్తే ఇలాంటి బౌలింగ్‌ను అద్భుతంగా చెప్పవచ్చు. అనేక మంది శ్వేత జాతీయేతర ఆఫ్ స్పిన్నర్లలాగే నరైన్ కూడా ఆరంభంలో యాక్షన్‌పై విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బయోమెకానికల్ పరీక్షల్లో సఫలమైన వచ్చిన తర్వాత అతని బౌలింగ్ మరింత పదునెక్కింది. 2011 చాంపియన్స్ లీగ్‌లో కేవలం 4.37 ఎకానమీ రేట్, 10.50 సగటుతో 10 వికెట్లు తీయడంతో ఒక్కసారిగా నరైన్ అందరి దృష్టిలో పడ్డాడు. దాంతో కోల్‌కతా 2012 ఐపీఎల్ కోసం 7 లక్షల డాలర్లతో సొంతం చేసుకుంది. దానికి న్యాయం చేస్తూ 5.47 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టిన అతను... నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించాడు. ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తర్వాతి సీజన్‌లో జట్టుగా కోల్‌కతా విఫలమైనా...ఈ స్పిన్నర్ మాత్రం 5.46 ఎకానమీతో 22 వికెట్లు తీసి సత్తా చాటాడు.
అంతర్జాతీయ స్థాయిలోనూ...
ఇటీవల బంగ్లాదేశ్‌లో ముగిసిన టి20 ప్రపంచకప్‌లో ఈ విండీస్ క్రికెటర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో అతను 4.60 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేశాడు. అంతకు ముందు జరిగిన నాలుగు టోర్నీలలో ఏ బౌలర్ కూడా 5కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయలేకపోయారు. బంగ్లా ప్రపంచకప్‌లో అతను వేసిన 20 ఓవర్లలో (120 బంతులు) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కేవలం రెండు సిక్సర్లు మాత్రమే కొట్టగలిగారు. అదీ ఒకటి ఫ్రీ హిట్‌కు కాగా, మరొకటి మ్యాచ్ ముగింపు దశలో ఫలితాన్ని ప్రభావితం చేయలేని సిక్సర్ మాత్రమే! ఈ 12 పరుగులు మినహాయిస్తే మిగతా 19.4 ఓవర్లలో అతని బౌలింగ్‌లో 80 పరుగులు మాత్రమే తీయగలిగారు.
వీటిలో కూడా రెండే ఫోర్లు ఉన్నాయి. లంక చేతిలో సెమీస్‌లో ఓడినా...ఈ కీలక మ్యాచ్‌లో అతను ఒక్క ఫోర్ గానీ సిక్స్ గానీ ఇవ్వకపోవడం విశేషం. అంటే నరైన్ బౌలింగ్‌లో రిస్క్ చేసి షాట్లు ఆడగల ధైర్యం బ్యాట్స్‌మెన్ చేయలేకపోతున్నారు. ఏదో ఒక మ్యాచ్‌తో సరి పెట్టకుండా సునీల్ టి20ల్లో నిలకడగా రాణిస్తుండటం అతని ప్రత్యేకతను చూపిస్తోంది. ఈ టోర్నీలో ఏ జట్టయినా కోల్‌కతాను చిత్తు చేయాలంటే ముందుగా నరైన్ మిస్టరీని ఛేదించక తప్పదని తొలి మ్యాచ్ ఫలితం చూపిస్తోంది. ఈసారైనా అతడిపై ఎవరైనా ఎదురు దాడి చేయగలరేమో చూడాలి.