పీసీబీకి మళ్లీ నిరాశే! | Sakshi
Sakshi News home page

పీసీబీకి మళ్లీ నిరాశే!

Published Thu, May 5 2016 5:08 PM

పీసీబీకి మళ్లీ నిరాశే!

కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవి కోసం సుదీర్ఘ అన్వేషణలో ఉన్న పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు)కు మరోసారి నిరాశే ఎదురైంది. పాకిస్తాన్ కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టువర్ట్ లాతో జరిపిన చర్చలు విఫలయత్నంగానే ముగిసాయి.  పాక్ కోచ్  పదవిపై స్టువర్ట్ లా పేరు  దాదాపు ఖరారైన తరుణంలో అతను పీసీబీకి ఝలక్ ఇచ్చాడు. తాను ఇప్పటికిప్పుడు కోచ్ పదవిని చేపట్టడానికి సిద్ధంగా లేనంటూ  స్టువర్ట్ లా తేల్చి చెప్పాడు. తాను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో ఇప్పటికే బ్యాటింగ్ కన్సెల్టెంట్గా ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో పాక్ కోచ్ పదవిని ఉన్నపళంగా స్వీకరించలేనంటూ పీసీబీకి తెలియజేశాడు.

 

దీనిపై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. పాక్ కోచ్ పదవి కోసం స్టువర్ట్ లా దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ ఆస్ట్రేలియాతో ఒప్పందం ఉన్న దరిమిలా అతను కోచ్ పదవిపై వెనకడుగు వేసినట్లు తెలిపారు. తమ మొదటి చాయిస్ గా స్టువర్ట్ లాను అనుకున్నా.. అతను ఆకస్మికంగా విముఖత వ్యక్తం చేశాడన్నారు. మరోసారి స్టువర్ట్ను సంప్రదించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.  ప్రస్తుతం పాక్ కోచ్ రేసులో ఇంగ్లండ్ కు చెందిన ఆండీ మూల్స్, ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్మెన్ డీన్ జోన్స్ లు ఉన్నట్లు షహర్యార్ తెలిపారు. వచ్చే నెల్లో  పాక్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటించనున్న నేపథ్యంలో కోచ్ పదవిపై మరో రెండు, మూడు రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని షహర్యార్ పేర్కొన్నారు. అంతకుముందు పాక్ కోచ్ పదవిపై ఇంగ్లండ్ మాజీ కోచ్ పీటర్ మూర్స్ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement