స్టేడియాలు తెరుచుకోవచ్చు 

Stadiums Can Open With Some Guidelines Says Union Home Ministry - Sakshi

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: ఈ నెలాఖరుదాకా పొడిగించిన ‘లాక్‌డౌన్‌ 4.0’లో ఆటలకు బాట పడింది. స్టేడియాలు, క్రీడా సముదాయాలు తెరుచుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే మైదానాలు, స్టేడియాల వద్ద ఏ ఒక్క ప్రేక్షకుణ్ని అనుమతించరాదని ఆ శాఖ వెల్లడించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత క్రీడాకారులకు ఇది కచ్చితంగా పెద్ద ఊరట. తాజా వెసులుబాటుతో ఇకపై భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రాల్లో శిక్షణా శిబిరాలు పునఃప్రారంభం అవుతాయి.

అయితే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘క్రీడా సముదాయాలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతిస్తున్నాం. అయితే ఆటగాళ్లకు తప్ప ప్రేక్షకులకు ప్రవేశం లేదు’ అని ఆ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. భారత్‌లోనూ కరోనా రంగప్రవేశంతో మార్చి మూడో వారం నుంచి ఆటలకు, శిబిరాలకు చుక్కెదురైంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ వల్ల క్రీడాకారుల కసరత్తుకు తీవ్రమైన అంతరాయం కలిగింది. దీనిపై పలువురు ఆటగాళ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఈ అంశంపై సమీక్షించి ప్రభుత్వానికి తెలియజేయడంతో నాలుగో విడత లాక్‌డౌన్‌లో ఎట్టకేలకు వెసులుబాటు దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top