
పాక్ జట్టుకు పచ్చ జెండా
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది.
► టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అనుమతి
► నేడు భారత్‌కు రాక
► ఆదివారం లంకతో ప్రాక్టీస్ మ్యాచ్
ఇస్లామాబాద్: టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకుగాను భారత్‌కు వెళ్లేందుకు పాక్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం షాహిద్ ఆఫ్రిది నాయకత్వంలోని పాక్ బృందం భారత్‌కు రానుంది. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదరీ నిసార్ అలీఖాన్‌తో జరిగిన సుదీర్ఘ సమావేశం తర్వాత తమ జట్టును భారత్‌కు పంపుతున్నామని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజమ్ సేథీ ప్రకటించారు. ‘క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త. పాక్ జట్టు భారత్‌కు వెళ్లేందుకు మా అంతర్గత వ్యవహారాల మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌తో సంప్రదింపుల తర్వాత భద్రతపై భారత్ గట్టి హామీ ఇచ్చింది. భద్రతా అంశాలపై భారత హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి కూడా చర్చలు జరిపారు. వీటిపై మేం సంతృప్తిగా ఉన్నాం.
దీంతో మా జట్టు శుక్రవారం రాత్రి దుబాయ్‌కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా శనివారం కోల్‌కతాకు చేరుకుంటుంది’ అని సేథీ పేర్కొన్నారు. మరోవైపు భద్రతపై చర్చల అనంతరం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని వెల్లడించింది. పాక్ హై కమిషనర్... కేంద్ర హోంశాఖ కార్యదర్శితో జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయని ఎంఈఏ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
పాక్ ప్రధాని అనుమతితోనే...
భద్రతపై లిఖితపూర్వక హామీ కావాలని పాక్ పట్టుబట్టడంతో ఉదయం నుంచి రెండు దేశాల మధ్య పెద్ద స్థాయిలోనే చర్చలు జరిగాయి. అయితే అన్ని జట్లకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించడం, ఆ తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాక్ జట్టుకు అత్యున్నత ఏర్పాట్లు చేస్తామని నేరుగా పీసీబీకి ట్వీట్ చేయడంతో పాక్ ప్రభుత్వం మెట్టు దిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పాక్ హై కమిషనర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని సౌదీ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు నిసార్ అలీఖాన్ నివేదించారు. దీంతో షరీఫ్ పాక్ జట్టు పర్యటనపై ఆమోద ముద్ర వేశారని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
తొలి ‘ప్రాక్టీస్’ రద్దు
పాక్ జట్టు భారత్‌కు రావడం ఆలస్యం కావడంతో శనివారం బెంగాల్ రంజీ జట్టుతో జరగాల్సిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. అయితే ఆదివారం కోల్‌కతాలో శ్రీలంకతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.