చెస్‌ చాంపియన్‌ శ్రీశ్వాన్‌

Sreeshwan Wins Telangana State Chess Championship - Sakshi

తెలంగాణ రాష్ట్ర చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఎం. శ్రీశ్వాన్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శ్రీశ్వాన్‌ విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టోర్నీలో నిర్ణీత 6 రౌండ్ల అనంతరం శ్రీశ్వాన్‌ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 5 పాయింట్లతో వి. వరుణ్, శ్రీ సాయి బశ్వంత్, భరత్‌ కుమార్‌రెడ్డి రెండో స్థానం కోసం పోటీపడ్డారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోర్‌ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా వరుణ్‌ రన్నరప్‌గా నిలిచాడు. సాయి బశ్వంత్, భరత్‌ కుమార్‌ వరుసగా మూడు, నాలుగు స్థానాలతో సంతృప్తిపడ్డారు. వీరు నలుగురు త్వరలో జరుగనున్న జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు.

శనివారం జరిగిన చివరిదైన ఆరో రౌండ్‌ గేమ్‌లో వరుణ్‌తో ఆడిన శ్రీశ్వాన్‌ మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. అంతకుముందు ఐదో గేమ్‌లో శ్రీ సాయి బశ్వంత్‌పై, నాలుగోరౌండ్‌లో అమిత్‌ పాల్‌ సింగ్‌పై, మూడో రౌండ్‌లో శిబి శ్రీనివాస్‌ ఐన్‌స్టీన్‌పై విజయాలు నమోదు చేశాడు. ఆరో రౌండ్‌ గేమ్‌ ఇతర బోర్డుల్లో సరయుపై శ్రీ సాయి బశ్వంత్, శ్రీకర్‌పై భరత్‌కుమార్‌ రెడ్డి, ప్రణయ్‌పై షణ్ముఖ, శ్రీథన్‌పై శరత్‌ చంద్ర, శిబి శ్రీనివాస్‌పై రిషిపాల్‌ సింగ్, అష్మితా రెడ్డిపై అకీరా నెగ్గారు. టోర్నీ ముగింపు కార్యక్రమంలో హ్యాండ్‌బాల్‌ జాతీయ కోచ్‌ రవి కుమార్, దీపక్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top