క్రీడా సంఘాల బకాయిలు చెల్లించాలి | Sports clubs to pay arrears | Sakshi
Sakshi News home page

క్రీడా సంఘాల బకాయిలు చెల్లించాలి

Oct 25 2013 12:29 AM | Updated on Nov 9 2018 5:52 PM

రాష్ట్ర క్రీడా సంఘాలకు గత మూడేళ్లుగా రావాల్సిన రూ.80 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ) కోరుతోంది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర క్రీడా సంఘాలకు గత మూడేళ్లుగా రావాల్సిన రూ.80 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ) కోరుతోంది. ఈమేరకు ఏపీఓఏ సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.రంగారావు, ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్‌లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కాలంలో ప్రతీ సంఘం సొంత డబ్బులతోనే టోర్నీలను నిర్వహించిందని వారు గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని వారు సీఎంను కోరారు.
 
 ‘మద్యం ఆదాయంలో వాటా ఇవ్వాలి’
 రాష్ట్ర ప్రభుత్వం క్రీడా బడ్జెట్‌లో కేటాయించిన రూ.222 కోట్లలో రూ.200 కోట్లు నియోజక వర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణాల కోసం ప్రతిపాదించారని ఏపీఓఏ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన రూ.22 కోట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(శాప్) అకాడమీల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుందని అన్నారు. దీనికి అదనంగా మరో రూ.20 కోట్లు మంజూరు చేస్తే క్రీడా సంఘాలు తమ ప్రాథమిక విధులు అమలు చేసే పరిస్థితి ఉంటుందని వారు తెలిపారు. అలాగే 2001లో జారీ చేసిన జీఓ ప్రకారం సూచించినట్టు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) మద్యం అమ్మకాల ఆదాయంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రతీ ఏడాది రూ.25 కోట్ల నిధులు శాప్‌కు కేటాయించాలని వారు కోరారు.  
 
 న్యాయం చేస్తామన్న సీఎం: ఏపీఓఏ
 క్రీడా సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఏపీఓఏ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వయాదవ్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో క్రీడలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement