ఆ విషయంలో వెనక్కి తగ్గని ద్రవిడ్‌..

Spoke To Dravid, Players Will Have To Go To NCA, Ganguly - Sakshi

న్యూఢిల్లీ:  ‘అసలు ఏం జరిగిందో జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను అడిగి తెలుసుకుంటాను. సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకొని పరిష్కరిస్తా. నేను బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ద్రవిడ్‌తో ఎన్‌సీఏ విషయమై భేటీ అయ్యాను. కుర్రాళ్లను తీర్చిదిద్దే అంశంలో అకాడమీలో అతని పరిధిని కూడా పెంచాను. అయితే గాయాలకు ఎన్‌సీఏనే చికిత్స చేస్తుంది. పునరావాస శిబిరాలు ఎన్‌సీఏ ఆధ్వర్యంలోనే జరగాలి. భారత ఆటగాడు ఎవరైనా ఇదే పాటించాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే.

గత కొంతకాలంగా వెన్నుగాయం కారణంగా  బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో  బుమ్రా గాయపడ్డ దగ్గర్నుంచీ బాగయ్యేదాకా అంతా సొంత టీమ్‌ సహకారంతోనే కోలుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తానొక బోర్డు కాంట్రాక్టు ఆటగాడినన్న సంగతే మరిచాడు. పూర్తిగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ చెప్పినట్లు నడుచుకున్నాడు. వారు చెప్పినట్లుగా ఢిల్లీ క్యాపిటల్‌ ట్రెయినర్‌ రజనీకాంత్‌ శివజ్ఞానం ఆధ్వర్యంలో ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. ఎన్‌సీఏ వర్గాలను సంప్రదించడం గానీ, సూచనలు పాటించడంగానీ ఎప్పుడూ చేయలేదు. ఇలా చేయడం సరైనదికాదనేది ద్రవిడ్‌ వాదన​.

 వెన్ను గాయం నుంచి కోలుకున్న అతను పునరాగమనం చేయాలంటే ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌ కావాల్సిందే. ఈ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటుంది. గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా అకాడమీని కాదని,  తన పునరావాసాన్ని తను చూసుకోవడం తగదని... అతనెలా పురోగతి సాధించాడో తెలియకుండా, క్రమం తప్పకుండా సమీక్షించకుండా... ఉన్నపళంగా ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించడం కుదరదని రాహుల్‌ ద్రవిడ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌సీఏ సున్నితంగా ఆ పేసర్‌కు చెప్పేసింది. ఎక్కడైనా... ఎప్పుడైనా వ్యవస్థలో ఓ పద్ధతిని అనుసరించే ద్రవిడ్‌ బుమ్రా ‘సొంత’ తెలివితేటలపై గుర్రుగా ఉన్నాడు.

అంతా బాగయ్యాక ఇక ఇక్కడెందుకు పరీక్షని భావించాడు. పేసర్‌కు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్‌ ట్రెయినర్‌ యోగేశ్‌ పర్మార్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది.  దీనిపై కాస్త ఆందోళన రేకెత్తింది. జట్టులో ఎంతటి స్టార్‌ ఆటగాడైనా ఒక పద్థతిని పాటించాలని, అది లేనప్పుడు మొత్తం దెబ్బతింటుందని ద్రవిడ్‌ భావించాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్ష హోదాలో సౌరవ్‌ గంగూలీ కూడా సీరియస్‌గా దృష్టి సారించడంతో నేరుగా ద్రవిడ్‌నే కలిశాడు. దీనిపై ద్రవిడ్‌తో మాట్లాడిన తర్వాత గంగూలీ మరొకసారి వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో వెనక్కి తగ్గని ద్రవిడ్‌.. ఇలా ప్రతీ ప్లేయర్‌ సొంత నిర్ణయాలు తీసుకుంటే మొత్తం ఉనికికే ప్రమాదం వస్తుందని గంగూలీకి తెలియజేశాడు. అదే విషయాన్ని స్పష్టం చేసిన గంగూలీ.. ప్రతీ ఒక్కరూ తమ పునరావసంలో ఎన్‌సీఏలోనే శిక్షణ తీసుకోవాలని తేల‍్చిచెప్పాడు.

‘నేను ద్రవిడ్‌ను నిన్న కలిశాను. ఎన్‌సీఏలో ఒక సిస్టం ఉంది.  భారత క్రికెటర్ల ఎవరికైనా చికిత్స-శిక్షణ అవసరమైతే ఎన్‌సీఏకే వెళ్లాలి. ఇక్కడ కారణం ఏదైనా, గాయపడ్డ ఆటగాళ్ల పర్యవేక్షణ బాధ్యత ఎన్‌సీఏదే. అది ఆటగాళ్లకు సౌకర్యవంతంగానే ఉంటుంది. చికిత్స కోసం శిక్షణ కోసం బయట ఫిజియోలను సంప్రదించడం సరైనది కాదు. ప్రస్తుతం ఎన్‌సీఏలో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. రాబోవు 18 నెలల్లో ఎన్‌సీఏ ఒక అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకుంటుంది’ అని గంగూలీ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top