ఆకలే... ఆటలో దించింది!

Special story to Spinner Pappu Roy - Sakshi

బుక్కెడు బువ్వ పెడతామంటే బంతులేసేందుకు సిద్ధపడ్డాడు. వికెట్‌ తీస్తే రూ. 10 ఇస్తామంటే సంబరపడ్డాడు. ఈ ఆట క్రికెట్‌ అని, తను చేసే పని బౌలింగ్‌ అని తెలియని వయసది. అయితే కాలంతో పాటు అతని దశ తిరిగింది. నా అనే వాళ్లెవరూ లేని రోజుల నుంచి... భారత ‘సి’ జట్టులోని 11 మందిలో ఒకడయ్యే దాకా ఎదిగాడు. ఇది స్పిన్నర్‌ పప్పు రాయ్‌ విజయ గాథ.  

గువాహటి: ఒడిశా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ పప్పు రాయ్‌ పేదవాడే కాదు... ఎవరూ లేనివాడు కూడా! అతనిది దీనగాథ కాదు... కన్నీటిగాథ! బీహార్‌కు చెందిన ఇతని తల్లిదండ్రులు అతని పసిప్రాయంలోనే కన్నుమూశారు. ఎంతటి పసితనమంటే... ‘అమ్మ నాన్న’ అని మాటలు నేర్వకముందే వాళ్లను కోల్పోయాడు. అయితే తన తండ్రి జందార్‌ రాయ్, తల్లి పార్వతి దేవి అని... బతుకుదెరువుకు కోల్‌కతా వచ్చారని ఎవరో చెబితే తెలుసుకున్నాడు. డ్రైవరైన జందార్‌ గుండెపోటుతో, తల్లి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని పప్పు ఇలా చెబుతాడు. ‘వాళ్లను (తల్లిదండ్రులు) నేనెప్పుడూ చూడలేదు. ఊరేదో తెలియదు. కేవలం వాళ్ల గురించి విన్నానంతే! ఇప్పుడు వాళ్లే ఉంటే భారత్‌ ‘సి’లో నా ఆట చూసేవారు. ఇది తలచుకుని రాత్రంతా ఏడ్చాను. కంటిపై కునుకులేకుండా గడిపాను’ అని 23 ఏళ్ల పప్పు రాయ్‌ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఏళ్లకేళ్లు పడిన కష్టం ఇప్పుడు భారత జట్టుకు ఎంపిక చేసిందన్నాడు.  

మామ మరణంతో మళ్లీ ఆకలి కేకలు... 
పసిబాలుడైన పప్పుని మామ అక్కున చేర్చుకున్నారు. కానీ దినసరి కూలి అయిన అతనూ కొన్నేళ్ల తర్వాత మరణించడంతో పప్పు ఆకలి కేకలు మళ్లీ మొదలయ్యాయి. అప్పుడే ‘క్రికెట్‌’ ఆదుకుంది. ముందు అన్నం పెట్టింది. తర్వాత జేబు (రూ.10) నింపింది. కోల్‌కతాలో క్రికెట్‌ ఆడే కుర్రాళ్లు అతన్ని బౌలింగ్‌ చేసేందుకు పిలిచారు. వికెట్‌ పడగొడితే 10 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. అలా ‘ఆకలి’ అతన్ని ఆటలోకి దింపింది. అలా హౌరా యూనియన్‌ క్రికెట్‌ అకాడమీ కోచ్‌ సుజిత్‌ సాహా కంటపడ్డాడు. ఆయన సలహాతో పేస్‌ బౌలింగ్‌ నుంచి స్పిన్న రయ్యాడు. 2011లో కోల్‌కతా సెకండ్‌ డివిజన్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే జట్టులో సుస్థిరంగా ఉన్న ఐరేశ్‌ సక్సేనా... తదనంతరం ప్రజ్ఞాన్‌ ఓజాలతో పోటీపడలేక బెంగాల్‌ నుంచి ఒడిశాకు మారాడు. ఎట్టకే లకు నాలుగేళ్ల తర్వాత 2015 బ్రేక్‌ ఇచ్చింది. కటక్‌లో జరుగుతున్న ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. అండర్‌–23 జట్టులోకి వచ్చాడు. మూడేళ్లు తిరిగే సరికి లిస్ట్‌ ‘ఎ’లో మేటి బౌలర్‌గా ఎదిగాడు. ఎనిమిది లీగ్‌ మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి రాణించాడు. ఆంధ్రతో జరిగిన తన తొలి లిస్ట్‌ ‘ఎ’ పోరులో హనుమ విహారి, రికీ భుయ్‌లను అద్భుతమైన డెలివరీలతో పెవిలియన్‌ చేర్చాడు. తాజాగా దేవధర్‌ ట్రోఫీ కోసం రహానే సార థ్యంలోని భారత్‌ ‘సి’ జట్టులోకి ఎంపికయ్యాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top