సున్నాతో ముగిసింది... 

Special Story About Australia Cricket Star Don Bradman - Sakshi

చివరి మ్యాచ్‌లో డకౌటైన క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌

99.94 సగటుతో ముగిసిన టెస్టు కెరీర్‌ 

సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌... క్రికెట్‌ చరిత్రలో నిస్సందేహంగా, మరో చర్చకు తావు లేకుండా అత్యుత్తమ ఆటగాడు. నాటితరంనుంచి నేటి వరకు ఎందరు ఆటగాళ్లు వచ్చినా, ‘డాన్‌’ తర్వాతి స్థానాల గురించి మాట్లాడాల్సిందే తప్ప మాట వరసకు కూడా పోలిక తీసుకు రాలేని గొప్పతనం అతనిది. బ్రాడ్‌మన్‌ నెలకొల్పిన రికార్డులు, ఘనతలు నభూతో న భవిష్యతి. రెండు దశాబ్దాల కెరీర్‌లో బ్యాట్స్‌మన్‌గా బ్రాడ్‌మన్‌ చేసిన అద్భుతాలు మరెవరికీ సాధ్యం కానివి. అలాంటి ఆల్‌టైమ్‌ గ్రేట్‌ కెరీర్‌ ‘సున్నా’తో చివరి మ్యాచ్‌ను ముగించడం అనూహ్యం. మరో నాలుగు పరుగులు చేసినా 100 సగటును సాధించగలిగే స్థితిలో ఈ ఆస్ట్రేలియన్‌ సూపర్‌ స్టార్‌ డకౌట్‌గా వెనుదిరగడం క్రికెట్‌ విషాదం.

బ్రాడ్‌మన్‌ 51 టెస్టుల కెరీర్‌లో అప్పటికే 6996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు ఉండగా...వాటిలో 2 ట్రిపుల్‌ సెంచరీలు, మరో 10 డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా చితక్కొడుతూ సాగించిన విధ్వంసక ఇన్నింగ్స్‌లు అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి అద్భుతానికి ముగింపు పలికే సమయం వచ్చింది. తన 40వ పుట్టిన రోజుకు రెండు వారాల ముందు ఇంగ్లండ్‌తో ముగిసే ఐదు టెస్టుల సిరీస్‌ చివరిదని బ్రాడ్‌మన్‌ ప్రకటించాడు. నాలుగు టెస్టులు ముగిసే సరికి 3 మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ సొంతం చేసుకుంది. సిరీస్‌లో డాన్‌ అప్పటికి 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో చివరి టెస్టుకు రంగం సిద్ధమైంది.

రెండు బంతులకే... 
14 ఆగస్టు, శనివారం, 1948... ఓవల్‌ మైదానం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే కుప్పకూలింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. సిడ్‌ బార్న్స్‌ తొలి వికెట్‌గా వెనుదిరగడంతో బ్రాడ్‌మన్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.  దిగ్గజ క్రికెటర్‌కు ఇదే ఆఖరి టెస్టు అని తెలియడంతో ఓవల్‌ మైదానం జనసంద్రమైంది. సుమారు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారు. సుదీర్ఘ కాలం తమ జట్టును చితకబాది ఊపిరాడకుండా చేసినా... ఇంగ్లండ్‌లో అతనంటే విపరీత అభిమానం, గౌరవం ఉన్నాయి. బ్రాడ్‌మన్‌ క్రీజ్‌లోకి వస్తుంటే అదే కనిపించింది. అందరూ నిలబడి చప్పట్లో స్వాగతం పలికారు. సాయంత్రం 5.50 అవుతోంది.

ఆ రోజు ఆట ముగిసేందుకు మరో 40 నిమిషాల సమయం ఉంది.  ఇంగ్లండ్‌ లెగ్‌స్పిన్నర్‌ ఎరిక్‌ హోలిస్‌ బౌలింగ్‌కు వచ్చాడు. బౌలర్‌గా అతనికి అంత పేరేమీ లేదు. అతనికిది ఏడో టెస్టు మాత్రమే. తొలి బంతిని నెమ్మదిగా వెనక్కి జరిగి డిఫెన్స్‌ ఆడగా, సిల్లీ మిడాఫ్‌ వరకు వెళ్లింది. పరుగేమీ రాలేదు. తర్వాత కొంత ఫీల్డింగ్‌ మార్పుతో హోలిస్‌ రెండో బంతిని వేశాడు. కాస్త ముందుకొచ్చి బ్రాడ్‌మన్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా టర్న్‌ అయిన ‘గూగ్లీ’ స్టంప్స్‌ను తాకింది. రెండు బంతులకే డాన్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.  అంతే... స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం. క్రికెట్‌ను శాసించిన దిగ్గజం ఆ తరహాలో నిష్క్రమించడం ఎవరికీ నచ్చలేదు. ప్రత్యర్థులైనా సరే అంతా అయ్యో అన్నవారే. ఇంగ్లండ్‌ చెత్త ప్రదర్శనతో మళ్లీ కుప్పకూలడంతో అతనికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు.

90వ పడిలో సర్‌

సెంచరీ సగటు కోల్పోయి... 
బ్రాడ్‌మన్‌ కెరీర్‌లో ఇది 52వ టెస్టు. ఆడిన 80 ఇన్నింగ్స్‌లలో 10 నాటౌట్‌లు కాగా 99.94 సగటుతో కెరీర్‌ ముగిసింది. మరో 4 పరుగులు చేసి ఉంటే సగటు సరిగ్గా 100 పరుగులు ఉండేది. అయితే వందను అందుకోకపోయినా 99.94 మాత్రం ఎవరూ అందుకోలేని స్థాయిలో చరిత్రలో నిలిచిపోయింది.   చివరి ఇన్నింగ్స్‌ గురించి ఆపై సాగిన చర్చను చూస్తే... నిజానికి అప్పట్లో ఇంత సూక్ష్మంగా గణాంకాల గురించి పట్టింపు ఉండేది కాదు. ఆడుతూపోతూ పరుగులు చేసేయడమే.

తన సగటు ఇంత అని, నాలుగు పరుగులు చేస్తే వంద అవుతుందని స్వయంగా బ్రాడ్‌మన్‌కు కూడా తెలీదని అతని సహచరుడు, నీల్‌ హార్వే వెల్లడించాడు.  డకౌట్‌ తర్వాత డాన్‌ కన్నీళ్లపర్యంతమయ్యాడని కథనాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత రిటైర్మెంట్‌ వేడుకలో బ్రాడ్‌మన్‌ ఇవన్నీ కొట్టిపారేశాడు. ‘నేను మైదానంలోకి వెళుతున్నప్పుడే అంత మంది ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, చివరి మ్యాచ్‌ కారణంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. అలాంటి స్థితిలో నిజానికి నేను ఆడిన తొలి బంతి కూడా నాకు సరిగా కన్పించనే లేదు. అంతే కానీ డకౌట్‌ గురించి ఏడవ లేదు. అయినా అదే నాకు చివరి ఇన్నింగ్స్‌ అవుతుందని నాకు కూడా తెలీదు కదా’ అని డాన్‌ వెల్లడించాడు. 

సచిన్‌తో డాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top