‘ఈడెన్‌ మెరుపులు’

Special Events Organized By The BCCI - Sakshi

►‘పింక్‌ టెస్టు’ సందర్భంగా బీసీసీఐ–బెంగాల్‌ క్రికెట్‌ సంఘం కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి ఈడెన్‌ గార్డెన్స్‌లో గంటను మోగించి మ్యాచ్‌ ఆరంభానికి తెర తీశారు. భారత కెప్టెన్ కోహ్లిని బంగ్లా ప్రధానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పరిచయం చేయగా... ఆ తర్వాత టీమిండియా ఇతర సభ్యులతో ఆమె కరచాలనం చేశారు.  

►మ్యాచ్‌ మధ్యలో మాజీ కెప్టెన్లతో పాటు పలువురు భారత క్రికెట్‌ దిగ్గజాలు ప్రత్యేక వాహనాల్లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా కలియదిరిగారు. కపిల్‌ దేవ్, సచిన్, అజహర్, గుండప్ప విశ్వనాథ్, వెంగ్‌సర్కార్, రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌ ఆడిన తొలి టెస్టులో పాల్గొన్న భారత, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లంతా కూడా శుక్రవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగూలీకి కెపె్టన్‌గా అది తొలి టెస్టు మ్యాచ్‌.

►క్రికెటేతర ఆటగాళ్లు అభినవ్‌ బింద్రా (షూటింగ్‌), పుల్లెల గోపీచంద్‌ (బ్యాడ్మింటన్‌), పీవీ సింధు (బ్యాడ్మింటన్‌), సానియా మీర్జా (టెన్నిస్‌), మేరీకోమ్‌ (బాక్సింగ్‌) కూడా ప్రత్యేక అతిథులుగా మ్యాచ్‌కు వచ్చారు.

►లంచ్‌ విరామం సమయంలో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లు ఈ మైదానంతో తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. 1993 హీరో కప్‌ ఫైనల్‌ గురించి కుంబ్లే చెప్పగా... ఆ్రస్టేలియాతో 2001 చారిత్రాత్మక టెస్టులో భాగమైన లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్, హర్భజన్‌ నాటి ముచ్చట్లు చెప్పారు. అంతకుముందు టాస్‌ సమయంలో ఆర్మీ పారా ట్రూపర్లు గాల్లో చక్కర్లు కొడుతూ మైదానంలోకి వచ్చి ఇద్దరు కెపె్టన్లకు గులాబీ బంతులను అందించాలని ముందుగా అనుకున్నా... భద్రతా పరమైన కారణాలతో దానిని చివరి నిమిషంలో రద్దు చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top