జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్‌జోన్)కు నగరం మరో సారి వేదికైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఈ టోర్నీ జరగనుంది.
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్‌జోన్)కు నగరం మరో సారి వేదికైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఈ టోర్నీ జరగనుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో భారత కబడ్డీ సమాఖ్య ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు.
సూపర్ నేషనల్స్ కోసం...
దేశవ్యాప్తంగా 33 జట్లను నాలుగు పూల్‌లుగా విభజించారు. ఒక్కో పూల్‌నుంచి నాలుగు జట్లను ఎంపిక చేసి జనవరి 21నుంచి పాట్నాలో సూపర్ నేషనల్స్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సౌత్ పూల్ విభాగం మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. హైదరాబాద్, ఆంధ్ర, అండమాన్ నికోబార్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.
వచ్చే ఆసియా క్రీడల కోసం గాంధీనగర్‌లో జరుగుతున్న భారత జట్టు క్యాంప్‌లో ఉన్న అనేక మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. ‘భారత కబడ్డీ భవిష్యత్తు, ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ టోర్నీని అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ మ్యాట్‌పై నిర్వహిస్తున్నాం’ అని జగదీశ్వర్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు రంగారావు, సంయుక్త కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు. మరో వైపు వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే ఆసియా క్రీడల్లో కబడ్డీలో రాణించాలనే సంకల్పంతో ఉన్న కొరియా జట్టు శిక్షణ, ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ రావడం విశేషం.