వేచి చూద్దాం!

Sourav Ganguly Speaks About IPL 2020 Will Be Truncated If It Happens - Sakshi

ఐపీఎల్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ తర్జనభర్జన

ఎప్పుడు మొదలయ్యేది చెప్పనేలేదు

ఒకవేళ జరిగినా... కుదింపే: గంగూలీ

బోర్డు దగ్గర పలు ప్రత్యామ్నాయాలు

ఐపీఎల్‌ 13వ సీజన్‌పై ‘కరోనా’ కమ్ముకుంది. ఇప్పుడైతే నిలిపివేశారు కానీ ఎప్పుడు జరిగేది ఎవరికీ తెలియదు. ఆపాలన్నా... జరపాలన్నా... ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వేచి చూసే ధోరణి తప్ప కచ్చితమైన నిర్ణయం తీసుకునే స్థితిలో క్రికెట్‌ బోర్డు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ స్కూళ్లను, సినిమా హాళ్లను, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీయులతో కలిసి ఆడే మ్యాచ్‌లను అనుమతిస్తాయని ఏమాత్రం ఆశించలేం. దీంతో దాదాపు ఈ సీజన్‌ విజేత ‘కరోనా’యే కావొచ్చు. అంటే మ్యాచ్‌లన్నీ రద్దు కావచ్చు!  

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఒక టోర్నీ! ఓ ఎనిమిది ఫ్రాంచైజీలు ఆడేది! ఎనిమిది నగరాల్లో జరిగేది! కానీ వేలాది మందిని ప్రత్యక్షంగా మురిపించేది. కోట్ల మందిని పరోక్షంగా అలరించేది. వేసవంతా డిజిటల్, టీవీ, మల్టీస్క్రీన్, ఓపెన్‌ ప్రొజెక్టర్‌ స్క్రీన్‌ ఇలా తెరల నిండా ఐపీఎల్‌ మ్యాచ్‌లే కనువిందు చేస్తాయి. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి ఐపీఎల్‌ వేదిక. అందుకేనేమో భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి (బీసీసీఐ) ఐపీఎల్‌ను ఆపేసేందుకు మనసు రావడం లేదు. అలా అని ఆడించేందుకు ముందుకు రావడం లేదు. ఏదైనా సరే వేచిచూద్దాంలే అనే ధోరణిలో ఉంది. కానీ బయటి పరిస్థితులు (భారత్‌లో) వేగంగా మారిపోతున్నాయి. కాదు... కాదు... మారిపోయాయి కూడా. రాష్ట్రాలన్నీ సమూహ వేదికల్ని మూసేస్తున్నాయి. పాఠాలు ఆగాయి. ప్రదర్శన (సినిమా)లు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాల్ని మూసేశాయి. ఇంత చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్‌ ఆటల్ని సాగనిస్తాయా అనేదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం అందరికీ తెలిసిందే. కచ్చితంగా ‘కుదరదు’, ‘జరగనివ్వదు’! అంతే.


షారూఖ్‌ ఖాన్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌)


పార్థ్‌ జిందాల్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌)

ఆలస్యం సరే! మరి జరిగే మార్గమేది? 
కరోనా ప్రభావం ప్రపంచానికే తెలిసిపోయింది. అందుకే వణికిపోతోంది. అలాంటిది బీసీసీఐకి మాత్రం తెలియకుండా ఉంటుందా... కచ్చితంగా తెలుసు! ఎప్పటికప్పుడు తెలుసుకొనే ఉంటుంది. కానీ ఫక్తు వ్యాపార కేంద్రమైనా లీగ్‌ను ఒక్క మాటతో రద్దు చేయలేదు. అలా చేస్తే వందల కోట్లు వెచ్చించిన ఫ్రాంచైజీలు, కోట్లు వెచ్చించిన స్పాన్సర్లు, వేల కోట్లు గుమ్మరించిన బ్రాడ్‌కాస్టింగ్‌ చానెళ్లు, గ్రౌండ్‌ రైట్స్‌ కొన్న పబ్లిసిటీ సంస్థలు, కాంట్రాక్టులు పొందిన లాజిస్టిక్‌ కంపెనీలు ఏమాత్రం ఊరుకోవు. తమకు ఆర్థిక సర్దుబాటు చేయాల్సిందేనని అమాంతం బోర్డు మీద పడిపోతాయి. అందుకే మొదట వచ్చేనెల 15 దాకా నిలిపివేత అని ప్రకటించింది క్రికెట్‌ బోర్డు. కానీ 16 నుంచి జరుగుతుందని మాత్రం చెప్పలేదు. చెబితే షెడ్యూల్‌ విడుదల చేస్తుంది. చూస్తుంటే ఈ సూచనలన్నీ రద్దుకేనా అన్నట్లు కనబడుతున్నాయి.


నెస్‌ వాడియా (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)

‘దాదా’ చెప్పింది అదే! 
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక వేళ నిర్వహిస్తే... టోర్నీని ‘కట్‌... కట్‌...’లతో ముగిస్తాం’ అని చెప్పారు. అంటే జరిపే పరిస్థితి అంటూ ఉంటేనే... కుదింపు అని చెప్పకనే చెప్పారు. బీసీసీఐ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఫ్రాంచైజీల యజమానులు పాల్గొన్నారు. పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చెప్పలేం. ఏమీ చేయలేం. ఇది అందరికీ తెలిసిన సంగతే. ఇలాంటి తరుణంలో ఎప్పుడు మొదలయ్యేది ఎలా చెబుతాం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నాం. రెండు, మూడు వారాల తర్వాత గానీ ఏ విషయంపై స్పష్టత రాదేమో’ అని చెప్పారు. బోర్డు దగ్గర ఆరు, ఏడు ఆప్షన్లు ఉన్నాయని పరిస్థితిని బట్టి వాటిని వెల్లడించవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. టోర్నీ జరిగే పక్షంలో ఒకప్పటిలా రెండు నెలల సుదీర్ఘ షెడ్యూలు నిర్వహించే పరిస్థితి ఈ సీజన్‌కు లేదు. ఇంకా చెప్పాలంటే రెండు వారాలు లేదంటే 20 రోజుల్లోనే ముగించే అంశాలపైనే బోర్డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


ఆకాశ్‌ అంబానీ (ముంబై ఇండియన్స్‌)

‘దేశవాళీ’ది... అదే గతి!
అన్ని మ్యాచ్‌లనూ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన
కరోనా మహమ్మారి వల్ల ఈ సీజన్‌ ఒక్క రంజీ ట్రోఫీతోనే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్‌–13ను వచ్చేనెల 15 వరకు వాయిదా మాటున నిలిపివేసింది. ఇక దేశవాళీ టోర్నీలది అదే దారి. రెస్టాఫ్‌ ఇండియా, రంజీ చాంప్‌ సౌరాష్ట్ర జట్ల మధ్య జరిగే ఇరానీ కప్‌ సహా, విజయ్‌ హజారే ట్రోఫీ, సీనియర్‌ మహిళల వన్డే నాకౌట్‌ టోర్నీ, సీనియర్‌ మహిళల వన్డే చాలెంజర్‌ ట్రోఫీ, జూనియర్‌ మహిళల టోర్నమెంట్లు, అండర్‌–19 వన్డే నాకౌట్‌ టోర్నీ, అండర్‌–19 టి20 లీగ్, సూపర్‌ లీగ్, నాకౌట్‌ టోర్నీ, చాలెంజర్‌ ట్రోఫీ, అండర్‌–23లో నాకౌట్, వన్డే చాలెంజర్‌ టోర్నీలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top