
మాజీ కెప్టెన్ సౌరవ్‌గంగూలి విశ్వాసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసుకుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సలహాదారు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్‌గంగూలి విశ్వాసం వెలిబుచ్చారు. అడ్వాన్డ్స్ హెయిర్ స్టూడియో పదో వార్షికోత్సవం సందర్భంగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సౌరవ్‌గంగూలి మంగళవారం చెన్నైలో సందడి చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కెప్టెన్ వీరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టులో యువక్రీడాకారుల ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ ఉత్సాహమే విజయానికి దారితీస్తుందని అన్నారు. ఒక్క కోహ్లీ మాత్రమే కాదు ఎంఎస్ ధోని సహా అందరూ ప్రతిభావంతమైన క్రీడాకారులేనని చెప్పారు. తమ హయాంతో పోల్చుకుంటే క్రికెట్ క్రీడారంగంలో ఒత్తిళ్లు పెరిగాయి, గట్టి పోటీ నెలకొని ఉందని అన్నారు. ప్రపంచ కప్‌లో భాగస్వామ్యులైన పాకిస్థాన్ అన్నిదేశాల జట్టు మెరుగైన క్రీడను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. ఏ జట్టు దేనికదే తీసిపోదు అనే విధంగా భారత్‌కు గట్టి పోటీ ఇస్తాయని చెప్పారు.
మీడియా సమావేశంలో గంగూలి, మోహిత్‌శర్మ, సంకేత్‌షా
అయితే ఆయా జట్టులను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్ జట్టుకు ఉందని చెప్పారు. కాగా, అడ్వాన్డ్స్ హెయిర్ స్టూడియోతోపాటూ బ్రాండ్ అంబాసిడర్‌గా తన ప్రయాణం పదేళ్లుగా సాగిపోతోందని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో పేరొందిన ఈ సంస్థ సీఈఓ సంకేత్‌షా దేశదేశాలు తిరుగుతూనే తనకు అవసరమైనపుడు ఐదు నిమిషాల్లో స్పందిస్తారని మెచ్చుకున్నారు. భారత్‌లో తనకెందరు అభిమానులు ఉన్నారో ఈ సంస్థకు అదే స్థాయిలో దేశ విదేశాల్లో అభిమానులు, ఖాతాదారులున్నారని చెప్పారు. ప్రపంచకప్ గెలవడంపై గట్టి నమ్మకంతో ఉన్నామని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపారు. సంకేత్ షా మాట్లాడుతూ, సౌరవ్‌గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం వల్ల తమ సంస్థకు మరింత ఖ్యాతి దక్కిందని అన్నారు. 1970లో అమెరికాలో ప్రారంభమైన తమ సంస్థ ఈ 45 ఏళ్ల కాలంలో 2.4 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులను సొంతం చేసుకుందని చెప్పారు. అంతేగాక ఒక మిలియన్ ప్రజలు తమ స్టూడియోపై ఆధారపడి లబ్ధి పొందినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మంది సెలబ్రిటీలకు తమ స్టూడియో సేవలు అందిస్తున్నదని వివరించారు.