సింధు సింగపూర్‌లో సాధించేనా..!

Singapore Open Title From Today - Sakshi

టైటిలే లక్ష్యంగా బరిలోకి

నేటి నుంచి సింగపూర్‌ ఓపెన్‌

సింగపూర్‌: భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్‌లో నిరాశపరిచింది. ఆల్‌ ఇంగ్లండ్‌ సహా పలు ఈవెంట్లలో బరిలోకి దిగిన ఆమె ఇంకా టైటిల్‌ బోణీనే కొట్టలేదు. ట్రోఫీల వెలతి వేధిస్తున్న ఈ ఒలింపిక్‌ రన్నరప్‌ తాజాగా సింగపూర్‌ ఓపెన్‌లో సత్తాచాటాలని ఆశిస్తోంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో టైటిలే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్‌ పోటీలు, బుధవారం నుంచి మెయిన్‌ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల సింగిల్స్‌లో సింధు నాలుగో సీడ్‌గా, సైనా నెహ్వాల్‌ ఆరో సీడ్‌గా తమ ఆట ప్రారంభిస్తారు. 

నిరీక్షణ ముగిసేనా...
గత డిసెంబర్‌లో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తెలుగుతేజం సింధుకు కొత్త సంవత్సరం ఇప్పటిదాకా కలిసిరాలేదు. ఇండోనేసియా ఓపెన్‌లో క్వార్టర్స్‌లో ఓడిన ఆమె... ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో అయితే తొలిరౌండ్లోనే కంగుతింది. ఇండియా ఓపెన్‌లో సెమీస్‌ చేరికే ఇప్పటివరకు ఆమె ఉత్తమ ప్రదర్శన కాగా... ఆదివారమే ముగిసిన మలేసియా ఓపెన్‌లో రెండో రౌండ్లోనే పరాజయం చవిచూసింది. నాలుగో సీడ్‌ సింధు ఈ టోర్నీలో తన నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది. బుధవారం జరిగే తొలిరౌండ్లో ఆమె ఇండోనేసియాకు చెందిన లియాని అలెసాండ్రా మయినకితో తలపడుతుంది. ఈ సీజన్‌లో టైటిల్‌ సాధించిన ఏకైక భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌. 29 ఏళ్ల  హైదరాబాదీ వెటరన్‌ స్టార్‌ ఇండోనేసియా ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో మారిన్‌ గాయంతో వైదొలగడంతో హైదరాబాదీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆల్‌ ఇంగ్లండ్‌లో క్వార్టర్స్‌ చేరిన ఆమె అనారోగ్య కారణాలతో స్విస్, ఇండియా ఓపెన్‌లకు దూరంగా ఉంది. తిరిగి మలేసియా ఈవెంట్‌లో ఆడినప్పటికీ తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది. ఆరో సీడ్‌ సైనా తొలిరౌండ్లో  లిన్‌ హొజ్మర్క్‌ జార్స్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో తలపడుతుంది. 

క్వాలిఫయర్‌తో శ్రీకాంత్‌
పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ టచ్‌లోకి వచ్చాడు. ఇండియా ఓపెన్‌లో ఫైనల్‌ చేరడం ద్వారా 17 నెలల అనంతరం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మలేసియా ఓపెన్‌లో ఈ భారత షట్లర్‌ క్వార్టర్స్‌ చేరాడు. ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న శ్రీకాంత్‌ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో పోటీపడనున్నాడు. భమిడిపాటి సాయిప్రణీత్‌కు తొలిరౌండ్లోనే క్లిష్టమైన పోటీ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్‌ కెంటో మొమొట (జపాన్‌)తో అతను తలపడనున్నాడు. హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌కి బ్రిస్‌ లెవెర్డెజ్‌ (ఫ్రాన్స్‌) ఎదురయ్యాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్‌ మలేసియాకు చెందిన చిమ్‌ జున్‌ వీతో ఆడతాడు. వీరితో పాటు పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్‌ రెడ్డి, ఎం.ఆర్‌.అర్జున్‌– శ్లోక్‌ రామచంద్రన్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్, మనీషా–అర్జున్, అనుష్క–సౌరభ్‌ వర్మ జోడీలు ఈ టోర్నీ బరిలో ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top