చీకటి రాజ్యం! | Shivlal Yadav lodges complaint against HCA official before BCCI, Lodha panel | Sakshi
Sakshi News home page

చీకటి రాజ్యం!

Aug 13 2015 11:48 PM | Updated on Sep 3 2017 7:23 AM

చీకటి రాజ్యం!

చీకటి రాజ్యం!

రెండు నెలలుగా సిబ్బందిలో చాలా మందికి జీతాలు లేవు... కరెంట్ చౌర్యం కేసులో జరిమానా కట్టకపోవడంతో అంధకారంలో ప్రధాన స్టేడియం...

హెచ్‌సీఏలో అన్నింటా అంధకారం
  నిధుల లేమితో ఇక్కట్లు
   లెక్కాపత్రం లేని ఖర్చులు
   అంతులేని అవినీతి ఆరోపణలు
 
 సాక్షి, హైదరాబాద్: రెండు నెలలుగా సిబ్బందిలో చాలా మందికి జీతాలు లేవు... కరెంట్ చౌర్యం కేసులో జరిమానా కట్టకపోవడంతో అంధకారంలో ప్రధాన స్టేడియం... ఏ పని చేసినా అవినీతి ఆరోపణలు.... బీసీసీఐని సాయం కోరదామంటే అక్కడి నుంచీ కనిపించని స్పందన... ఇదీ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రస్తుత పరిస్థితి. సాధారణంగా దేశంలోని ఏ క్రికెట్ సంఘం అయినా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుంది. బీసీసీఐనుంచి వచ్చే నిధులతో పాటు మ్యాచ్‌ల నిర్వహణ ద్వారా కూడా వచ్చే ఆదాయంతో కళకళ్లాడుతుంటుంది. కానీ డబ్బులు లేని ఇలాంటి స్థితి మాత్రం ఒక్క హెచ్‌సీఏలోనే కనిపిస్తోంది. అసోసియేషన్ మొత్తం అవినీతిలో కూరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెతున్నాయి.
 
 అర్షద్ జమానాలోనే...
 సాధారణంగా బీసీసీఐ ప్రతీ ఏటా అసోసియేషన్లకు ఇచ్చే మొత్తం బోర్డు ఆదాయాన్ని బట్టి స్వల్పంగా మారుతూ ఉంటుంది. 2014-15 సంవత్సరానికి బోర్డునుంచి హెచ్‌సీఏకు రూ. 26 కోట్లు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన నాటినుంచి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అనవసరపు ఖర్చులు, హంగామా కోసమే వీటిని ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేశారని చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంచిన కనోపి బిల్లు రూ. 1.2 కోట్లను కూడా కొత్త కమిటీ రాగానే చెల్లించేసింది. స్టేడియం పెయింటింగ్, ఆఫీస్ బేరర్ల కార్యాలయాల ఆధునీకరణ, లీగల్ ఫీజులు, లీగ్ మ్యాచ్‌ల నిర్వహణకు గ్రౌండ్‌ల ఖర్చు, జిల్లాలో క్రికెట్ నిర్వహణ... ఇలా ఒక్కో కమిటీ సభ్యుడు ఒక్కోదానిని పంచుకొని ఎలాంటి టెండర్లు లేకుండానే భారీ మొత్తాలను కొల్లగొట్టినట్లు సమాచారం. దీంతో మొత్తం డబ్బు ఖర్చయింది. బీసీసీఐ నుంచి రాబోయే ఏడాది బడ్జెట్‌లో నుంచి కూడా రూ.10 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకున్నట్లు సమాచారం. అయినా నిధుల కోసం అల్లాడుతున్నారు. గతంలోనూ అయూబ్ అధ్యక్షుడిగా ఉన్న (2010-12) సమయంలోనే జరిగిన అవినీతి ఆరోపణలపై హెచ్‌సీఏపై పలు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అయితే నిండా మునిగినవాడికి చలేంటి... అన్నట్లుగా కొందరు మరింత అవినీతికి పాల్పడుతుండగా, గత ఏడాది ఆగస్టు తర్వాత ఏసీబీనుంచి ఒక్క నోటీసు కూడా రాకపోవడం వీరికి  ధైర్యాన్ని ఇచ్చిందని హెచ్‌సీఏ సభ్యులే చెబుతున్నారు.
 
 లెక్కాపత్రం లేదు
 విద్యుత్ చౌర్యం కారణంగా అధికారులు విధించిన రూ. 2.11 కోట్ల జరిమానా చెల్లించే పరిస్థితి లేక ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం అంధకారంలో ఉంది. పెద్దలంతా ఇప్పుడు జింఖానా మైదానానికి తరలిపోయారు. అడుగడుగునా తప్పుడు బిల్లులు, అసలు బిల్లులే లేకపోవడంతో అకౌంట్స్‌ను ఆడిట్ చేయడం తమ వల్ల కాదంటూ ఆడిటర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. గత ఏడాది లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం అంపైర్లకే రూ. 75 లక్షలు చెల్లించినట్లుగా ఉండడం అవినీతికి పరాకాష్ట అని ఒక ఈసీ సభ్యుడు ఆరోపించారు. ఈ కారణాలతో ఎప్పుడో మే నెలలో సభ్యుల ముందు ఉంచాల్సిన అకౌంట్లకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. దీనిపై స్పష్టత వస్తే గానీ ఫైనాన్స్ సబ్ కమిటీకి వెళ్లడం, ఆపై ఏజీఎం నిర్వహించడం సాధ్యం కాదు. అది జరిగిన తర్వాతే పరిస్థితి వివరించి బీసీసీఐని సహాయం అర్థించే అవకాశం ఉంటుంది. అయినా...బోర్డు రాజకీయాల కారణంగా కూడా అక్కడా అయూబ్‌కు అనుకూల వాతావరణం ఏమీ లేదు. హెచ్‌సీఏ ముందు అన్ని అకౌంట్లను ప్రవేశపెట్టాకే లెక్కలపై పూర్తి స్పష్టత రావచ్చు. ప్రస్తుతానికి మాత్రం సీజన్ ఆరంభానికి ముందే ఎటూ పాలుపోని పరిస్థితిలో హెచ్‌సీఏ ఉంది.
 
 కొత్త సంఘాల ఒత్తిడి
 మరో వైపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన హెచ్‌సీఏ కేవలం జంట నగరాలకే పరిమితమైందన్న విమర్శ ఉంది. జిల్లాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయకపోగా, అక్కడి ప్రతినిధులను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోకుండా హెచ్‌సీఏ వ్యవహరిస్తోందనేది ఆరోపణ. దీంతో తెలంగాణలోని రాజకీయ నాయకుల అండతో ఇప్పుడు జిల్లాల్లో ప్రతిభాన్వేషణ పేరుతో రెండు కొత్త క్రికెట్ సంఘాలు పుట్టుకొచ్చాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనే ఈ సంఘాలకు ఇప్పటికిప్పుడు బీసీసీఐ గుర్తింపు దక్కకపోయినా...హెచ్‌సీఏ పరిస్థితి ఇలాగే సాగితే భవిష్యత్తులో ఇవి ప్రత్యామ్నాయంగా ముందుకు రావడం ఖాయం.
 
 అయూబ్, జాన్‌పై శివలాల్ ఫిర్యాదు
 మరో వైపు హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉంటూ సొంత అకాడమీలు నిర్వహిస్తున్నారంటూ అర్షద్ అయూబ్, జాన్ మనోజ్‌లపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ లోధా కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా దీనిని కూడా తీసుకోవాలని ఆయన కమిటీకి విజ్ఞప్తి చేశారు. వీరి అకాడమీల్లో చేరితేనే జట్టుకు ఎంపికవుతారని తల్లిదండ్రులు భావించడం వల్ల వేసవిలో హెచ్‌సీఏ సొంత అకాడమీ మూత పడిందని శివలాల్ ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement