అఫ్గాన్‌ నెట్స్‌లో భారత దివ్యాంగ క్రికెటర్‌!

Shankar Sajjan A Differently Abled Bowler Dreams of Playing for India - Sakshi

బెంగళూరు : భారత్‌-అఫ్గానిస్తాన్‌ల చారిత్రాత్మక టెస్ట్‌ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు భారత ఓపెనర్ల సెంచరీలు.. మిడిలార్డర్‌ విఫలం.. ఆటముగిసే సమయానికి 347 పరుగులు.. ఇదంతా ఒకవైపు. కానీ అఫ్గాన్‌ నెట్స్‌లో ఓ భారత దివ్యాంగ క్రికెటర్‌ బౌలింగ్‌ చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రెండు చేతులు సరిగ్గా లేని బిజాపుర్‌కు చెందిన శంకర్‌ సజ్జాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రికెటర్‌ను ఇంటర్వ్యూ చేసిన ఓ సోర్ట్స్‌ వెబ్‌సైట్‌.. ఆ వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. శంకర్‌ బౌలింగ్‌ చూసిన నెటిజన్లు స్పూర్తిదాయకంగా నిలిచావు బ్రదర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. శంకర్‌ పట్టుదలకు..కష్టపడేతత్వానికి వారంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం అనిల్‌ కుంబ్లే క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న శంకర్‌.. భారత్‌కు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యమని తెలిపాడు.

రషీద్‌, కుంబ్లేలే నాకు స్పూర్తి..
అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌, టీమిండియా దిగ్గజం అనిల్‌ కుంబ్లేలే తనకు ‍స్పూర్తి అని ఈ శంకర్‌ భాయ్‌ చెప్పుకొచ్చాడు. ‘నాలుగో తరగతి నుంచి రోజుకు కనీసం 5-6 గంటలు క్రికెట్‌ ఆడేవాడిని. నాకు రోజు పేపర్లు చదివే అలవాటు ఉంది. అలా ఓ రోజు కన్నడ పత్రికలో అనిల్‌ కుంబ్లే స్పిన్నర్స్‌ క్యాంప్‌ గురించి వచ్చిన యాడ్‌ చూశాను. అక్కడున్న మెయిల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకున్నాను. సానుకూల స్పందన రావడంతో బెంగళూరు వచ్చి అకాడమీలో చేరాను.’ అని శంకర్‌ తెలిపాడు.

ఇక తానెప్పుడు దివ్యాంగ క్రికెటర్లతో కాకుండా రెగ్యులర్‌ క్రికెటర్లతోనే ఆడుతానని శంకర్‌ తెలిపాడు. తన ఆట చూసిన తర్వాత ఇతరులు ఏమనకుంటారని అడగగా.. ‘నేనేవరో నేనేంటో నాకు తెలుసు.. కాబట్టి ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అని నేను ఫీలవ్వను’ అని సమాధానమిచ్చాడు. తమ అకాడమికీ అఫ్గాన్‌ ఆటగాళ్లు వస్తున్నారని, వారికి బౌలింగ్‌ చేయాలని అకాడమీ అధికారి తెలిపారని, అలా వారికి బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చిందని ఈ దివ్యాంగ క్రికెటర్‌ మురిసిపోయాడు. తన బౌలింగ్‌ ఎదుర్కొన్నఅఫ్గాన్‌ ఆటగాళ్లు తనకు మంచి భవిష్యత్తు ఉందని, ఆటను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అని చెప్పారని శంకర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top