శ్రీశాంత్‌కు ఊరట

SC has given me a lifeline by lifting life ban: Sreesanth - Sakshi

జీవితకాల నిషేధాన్ని రద్దు చేసిన సుప్రీం కోర్టు

శిక్షా కాలం తగ్గించమంటూ బీసీసీఐకి సూచన   

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ పేసర్‌ శాంతకుమారన్‌ శ్రీశాంత్‌కు సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించింది. తనపై బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అతను వేసిన పిటిష¯Œ పై సుప్రీం తీర్పునిచ్చింది. శ్రీశాంత్‌పై విధించిన జీవిత కాల నిషేధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచీ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్‌ శిక్షా కాలాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కూడా బీసీసీఐకి నిర్దేశించింది. అయితే శిక్షా కాలం తగ్గించమని మాత్రమే ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి శ్రీశాంత్‌పై ఢిల్లీ హైకోర్టులో నమోదైన క్రిమినల్‌ అభియోగాల విచారణపై తమ తీర్పు ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేసింది. అంటే అతడిని పూర్తిగా నిర్దోషిగా ప్రకటించలేదని అర్థమవుతోంది. అయితే తాజా తీర్పు పట్ల కేరళ క్రికెట్‌ సంఘం మాజీ అధ్యక్షుడు టీసీ మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. నిషేధం కారణంగా శ్రీశాంత్‌ ఆరేళ్లు కోల్పోయాడని, దానిని తొలగిస్తే అతను ఇప్పటికి ప్పుడు క్రికెట్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నా... క్రికెట్‌కు సంబంధించి ఏదో ఒక రంగంలో మళ్లీ కెరీర్‌ను వెతుక్కోగలడని ఆయన అన్నారు.   

పరిశీలిస్తాం: సీఓఏ 
శ్రీశాంత్‌ నిషేధం విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై తాము వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటామని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అన్నారు. త్వరలో జరిగే సీఓఏ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని ఆయన వెల్లడించారు.  

క్రికెట్‌నే జీవితంగా భావించిన నేను ఇన్నేళ్లుగా ఆటకు దూరమయ్యాను. సుప్రీం తీర్పును గౌరవించి బీసీసీఐ మళ్లీ ఆడే అవకాశం నాకు ఇస్తుందని ఆశిస్తున్నా. మైదానంలో నీకు అనుమతి లేదంటూ ఎవరైనా అడ్డుకోకుండా ఇప్పటికైనా నేను ప్రాక్టీస్‌ చేయగలిగితే చాలు. కష్టకాలంలో హర్భజన్, సెహ్వాగ్, రైనా తదితరులు కూడా నాకు అండగానిలిచారు. నా జీవితంలో ఎంతో కొంత మిగిలి ఉన్న ఆటను ఆడాలనుకుంటున్నా. అయినా 42 ఏళ్ల వయసులో లియాండర్‌ పేస్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించగా లేనిది నేను క్రికెట్‌ ఆడలేనా.
– శ్రీశాంత్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top