రంజీ చరిత్రలో సౌరాష్ట్ర నయా రికార్డు

Saurashtra Outclass Bengal To Lift 1st Ever Title - Sakshi

రాజ్‌కోట్‌: సౌరాష్ట్ర రంజీ జట్టు కొత్త రికార్డు సృష్టించింది. రంజీ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుని నయా రికార్డును లిఖించింది. తుది పోరులో బెంగాల్‌తో తలపడిన సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా కావడంతో మొదటి ఇన్నింగ్స్‌ ఆధారంగా సౌరాష్టను టైటిల్‌ వరించింది. శుక్రవారం చివరి రోజు ఆటలో బెంగాల్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు సాధించిన సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో నాకౌట్‌ మ్యాచ్‌లు డ్రా అయిన పక్షంలో విజేతను తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా ప్రకటించే సంగతి తెలిసిందే. 

నిన్నటి వరకూ రసపట్టులోనే
తాజా రంజీ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేది నిన్నటి వరకూ ఆసక్తికరంగా ఉంది. గురువారం ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. దాంతో ఈ రోజు ఆటలో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోరును బెంగాల్‌ అధిగమిస్తుందని అంతా భావించారు. కానీ సౌరాష్ట్ర బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 27 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది బెంగాల్‌. ఓవర్‌నైట్‌ ఆటగాడు మజుందార్‌(63) ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత అమాబ్‌ నంది(40 నాటౌట్‌) అజేయంగా నిలిచినా మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టేయడంతో బెంగాల్‌కు ఆధిక్యం దక్కలేదు. దాంతో అక్కడే సౌరాష్ట్రకు టైటిల్‌ ఖాయమైంది. ఇక మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో సౌరాష్ట్ర ట్రోఫీని ముద్దాడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top