సానియా ‘షో' | Sania Mirza, Cara Black enter WTA year-end finals | Sakshi
Sakshi News home page

సానియా ‘షో'

Oct 26 2014 12:45 AM | Updated on Sep 2 2017 3:22 PM

సానియా ‘షో'

సానియా ‘షో'

సింగపూర్: పట్టుదలకు అనుభవం కూడా తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిరూపించింది.

కారా బ్లాక్‌తో కలిసి టైటిల్ పోరుకు అర్హత
 
 
 సింగపూర్: పట్టుదలకు అనుభవం కూడా తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిరూపించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా తన భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి అంతిమ సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 7-5, 11-9తో క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడీపై అద్భుత విజయం సాధించింది.

రెండు గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ పోరులో సానియా జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలుపొందడం విశేషం. ఒకవైపు తన భాగస్వామి కారా బ్లాక్ కచ్చితమైన సర్వీస్‌లు చేయడంలో ఇబ్బంది పడుతోంటే... మరోవైపు సానియా అన్నీ తానై మ్యాచ్‌ను నడిపించింది. పదునైన రిటర్న్ షాట్‌లకు తోడు నెట్‌వద్ద అప్రమత్తంగా వ్యవహరించి కీలక దశలో పాయింట్లు నెగ్గడంలో ముఖ్యపాత్ర పోషించింది.

నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జంట ఒక దశలో 6-9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సానియా, కారా బ్లాక్ సమన్వయంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 9-9తో సమం చేశారు. అదే జోరులో మరో రెండు పాయింట్లు నెగ్గి 11-9తో విజయాన్ని ఖాయం చేసుకున్నారు. తద్వారా సానియా తన కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరుకుంది.

మరోవైపు వేర్వేరు భాగస్వాములతో కలిసి గతంలో ఈ టోర్నీని రెండుసార్లు నెగ్గిన కారా బ్లాక్ మూడో టైటిల్ రేసులో నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా)లతో సానియా ద్వయం తలపడుతుంది. మరో సెమీఫైనల్లో సు వీ సెయి-షుయె పెంగ్ 6-1, 6-4తో అలా కుద్రయెత్సేవా (రష్యా)-రొడియోనోవా (ఆస్ట్రేలియా)లపై గెలిచారు.
 
 ఆ సమయంలో చాలా ఉత్కంఠకు లోనయ్యా. ఎలాగైనా మ్యాచ్‌లో నిలవాలని భావించాం. సూపర్ టైబ్రేక్‌లలో ఏదైనా జరగొచ్చు. 6-9తో ఉన్న సమయంలో ఒక్క సర్వ్‌ను ప్రత్యర్థి బ్రేక్ చేసినా చాలు. అందుకే తొలి సర్వీస్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనుకున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడొచ్చని అనిపించింది.    - సానియా మీర్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement